Uddhav Thackeray : ఉద్ధవ్ థాకరేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Uddhav Thackeray : గుండె ధమనుల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయనను పరీక్షించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు.
- By Latha Suma Published Date - 04:56 PM, Mon - 14 October 24

Reliance Hospital: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఉద్ధవ్ థాకరే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయను యాంజియోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఉద్ధవ్ థాకరే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గుండె ధమనుల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయనను పరీక్షించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు. ఆయన గుండెలో అడ్డంకులు ఉన్నట్లు.. ఈరోజే యాంజియోప్లాస్టీ చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
Read Also: PM Modi : ప్రధాని మోడీని కలిసిన ఢిల్లీ సీఎం అతిశీ
ఉద్ధవ్ థాకరే మొదటిసారిగా 20 జూలై 2012న యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఈ ఏడాది నవంబర్‌లో యాంజియోప్లాస్టీ చేయించుకోవలసి వచ్చింది. అక్టోబర్ 12న జరిగిన దసరా ర్యాలీ తర్వాత ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. అంతకుముందు 2016లో కూడా థాకరే ముంబయిలోని లీలావతి హాస్పిటల్ లో యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన రిలయన్స్ ఆసుపత్రిలో చేరగా.. ఈరోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావచ్చని సమాచారం.
మరోవైపు ఈ వారమే మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ థాకరే ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.