Chengalpattu Express: చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ
ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దుండగులు సాహసోపేతంగా దోపిడీకి పాల్పడి ప్రయాణికులలో భయాందోళన కలిగించారు.
- By Kavya Krishna Published Date - 12:40 PM, Tue - 24 June 25
Chengalpattu Express: ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దుండగులు సాహసోపేతంగా దోపిడీకి పాల్పడి ప్రయాణికులలో భయాందోళన కలిగించారు. ఈ ఉదంతం మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది.
ప్రణాళికాబద్ధంగా రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసిన దుండగులు, ట్రాక్ పక్కనున్న కేబుల్‌ను కత్తిరించారు. దీంతో సిగ్నలింగ్ రద్దవడంతో చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దుండగులు రైలులోకి ప్రవేశించి, కత్తులతో ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు లూటీ చేశారు. అనంతరం వారు అక్కడినుంచి పరారయ్యారు.
ఈ ఘటనలో విశాలాక్షి అనే మహిళ మెడలో ఉన్న 27 గ్రాముల బంగారు చైన్‌ను దుండగులు లాక్కెళ్లినట్లు సమాచారం. బాధితులు రేణిగుంట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే సమయంలో, మరో రైలు — చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ (17654)లోనూ దోపిడీ జరిగింది. రామలింగయ్యపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో, దొంగలు ఒకదానిపై ఒకరు పడి ప్రయాణికుల మెడలలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు.
దివ్యభారతి అనే మహిళ నుంచి 30 గ్రాముల గోలుసు మాయం కాగా, మరికొందరు ప్రయాణికులూ తమ ఆభరణాలు పోయినట్లు తెలిపారు. ఈ ఘటన వలన రైలు ప్రయాణికుల భద్రతపై మరోసారి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఘటనలపై రైల్వే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Iran: ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ.. ఇరాన్ అధికారిక ప్రకటన