Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నారా.. అలాచేస్తే రూ. 5వేలు జరిమానా
చార్‌ధామ్ యాత్ర బుధవారం (ఏప్రిల్ 30) ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరవడంతో ప్రారంభమవుతుంది.
- By News Desk Published Date - 09:53 PM, Tue - 29 April 25

Chardham Yatra: చార్ ధామ్ యాత్ర ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించే యాత్రను చార్ ధామ్ యాత్ర అంటారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్‌ధామ్ యాత్రకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. యాత్ర మార్గాల్లో దాదాపు 6వేల మంది పోలీసులు, 17 కంపెనీల పీఏసీ (ప్రావిన్షియల్ ఆర్ముడ్ కానిస్టేబులరీ), పది కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ దీపమ్ సేథ్ తెలిపారు. మొత్తం ప్రయాణ ప్రాంతాన్ని 15 సూపర్ జోన్లుగా విభజించి 2వేలకుపైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గత సంవత్సరం చార్‌ధామ్ యాత్రకు 48లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఆ సమయంలో భారీ వర్షాల నేపథ్యంలో కేదార్‌నాథ్ యాత్రకు రెండు వారాలకుపైగా అంతరాయం కలిగింది. ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో 60లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 20 లక్షల మంది యాత్రికులు చార్ ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు.
చార్‌ధామ్ యాత్ర బుధవారం (ఏప్రిల్ 30) ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరవడంతో ప్రారంభమవుతుంది. మే 2న కేదార్‌నాథ్ ద్వారాలు, మే4వ తేదీన బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకుంటాయి.
Also Read: IND- PAK War : సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన మోడీ..పాక్ పనైపోయినట్లే !
చార్‌ధామ్ యాత్రను పటిష్ఠ భద్రత ఏర్పాట్ల మధ్య సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అనేక చర్యలు చేపట్టింది. మరోవైపు బద్రీనాథ్ ధామ్‌లో నిర్వాహకులు ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వీడియో కాలింగ్, ఫొటోలు తీయడంపై నిషేధం విధించారు. ఈ నియమాన్ని ఏ భక్తుడైనా ఉల్లంఘిస్తే అతనికి రూ.5వేలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.
చార్‌ధామ్ కోసం ..
24 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, 66 ఇన్స్పెక్టర్లు, 366 సబ్ ఇన్స్పెక్టర్లు, 615 హెడ్ కానిస్టేబుల్స్, 1222 కానిస్టేబుల్స్, 208 మంది మహిళా కానిస్టేబుళ్లు, 926 హోమ్ గార్డులు, 1049 పిఆర్‌డి సైనికులు, తొమ్మిది కంపెనీ పీఏసీలు, ఎస్డీఆర్ఎఫ్ 26 ఉప బృందాలు మోహరించనున్నాయి.