Judge Comments : ‘‘ఇది హిందుస్తాన్.. మెజారిటీ ప్రజల ప్రకారమే దేశం నడుస్తుంది’’.. హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
యూసీసీని కేవలం వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్‌లే కాదు.. దేశ సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది’’ అని న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్(Judge Comments) పేర్కొన్నారు.
- By Pasha Published Date - 12:55 PM, Mon - 9 December 24

Judge Comments : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది హిందుస్తాన్.. హిందుస్తాన్ అనేది దేశంలో నివసించే మెజారిటీ ప్రజల అభిమతానికి అనుగుణంగా నడుస్తుంది. ఈవిషయాన్ని చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు’’ అని జస్టిస్ శేఖర్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదే న్యాయం.. మెజారిటీ ప్రజల అభిమతానికి అనుగుణంగానే న్యాయం అమలవుతుంది. దేశంలోని మెజారిటీ వర్గం కుటుంబాలు, సమాజం పొందే ప్రయోజనాలు, సంక్షేమం, సంతోషం ఆధారంగానే అంతా నడుస్తుంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ‘లైవ్ లా’ ఒక కథనాన్ని ప్రచురించింది.
Also Read :PM – Adani Masks : మోడీ-అదానీ మాస్క్‌లు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు.. రాహుల్‌గాంధీ ప్రశ్నలకు జవాబులు
‘‘దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేయాలి. ఒకరికి మించి భార్యలు, ట్రిపుల్ తలాఖ్, హలాలా వంటివి ఆమోదయోగ్యం కావు. పర్సనల్ లా పేరుతో వీటిని పాటిస్తామంటే కుదరదు. హిందూ శాస్త్రాలు, వేదాల్లో మహిళలను దేవతలుగా కీర్తించారు. అలాంటి వనితలను అగౌరవపర్చడాన్ని అనుమతించకూడదు. మహిళలకు ట్రిపుల్ తలాక్ ఇచ్చేస్తాం. కానీ వాళ్లకు భరణం ఇవ్వం అంటే కుదరదు. యూసీసీని కేవలం వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్‌లే కాదు.. దేశ సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది’’ అని న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్(Judge Comments) పేర్కొన్నారు. ‘‘హిందూయిజంలో గతంలో బాల్య వివాహాలు, సతి వంటి దురాచారాలు ఉండేవి. అయితే రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు వాటిని నిర్మూలించడానికి మహా పోరాటాలు చేశారు’’ అని ఆయన తెలిపారు. ‘‘దేశంలోని ఇతర మతాల వాళ్లు హిందూ కల్చర్, సంప్రదాయాలను గౌరవించకున్నా పర్వాలేదు. కానీ అగౌరవపర్చకుంటే చాలు. భారత మహోన్నత వ్యక్తులు, ఇక్కడి దేవతలను గౌరవించాలి’’ అని జడ్జి తెలిపారు. కాగా, ఇదే కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ పాఠక్ కూడా పాల్గొన్నారు.