Union Cabinet : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు ఇవే..
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ..వివరాలు క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. గత దశాబ్దంలో ఖరీఫ్ పంటల MSPలో భారీ వృద్ధి చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పెంపు వల్ల రైతులకు పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.
- By Latha Suma Published Date - 04:08 PM, Wed - 28 May 25

Union Cabinet : కేంద్ర క్యాబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్ కోసం పలు పంటల మద్దతు ధరలు (MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వరి (ధాన్యం) మద్దతు ధరను క్వింటాల్కు రూ.69 పెంచుతూ, మొత్తంగా రూ.2369కి చేరేలా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ..వివరాలు క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. గత దశాబ్దంలో ఖరీఫ్ పంటల MSPలో భారీ వృద్ధి చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పెంపు వల్ల రైతులకు పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచించింది. మొత్తం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2.7 లక్షల కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు. ఇది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక లాభాలను అందించడంతో పాటు, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది.
Read Also: CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించినట్లు కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణాలపై రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు లభించేలా ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించుకునే అవకాశం రైతులకు లభిస్తుంది. ఇంకా, రాష్ట్రాల అభివృద్ధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బద్వేల్ – నెల్లూరు నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.3,653 కోట్ల వ్యయంతో 108.134 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత, బద్వేల్, నెల్లూరు మధ్య రవాణా వేగం మెరుగవడంతో పాటు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి కీలక నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగాల్లో సమతుల్య అభివృద్ధికి కృషి చేస్తోందని, కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు దేశాభివృద్ధికి మరింత బలాన్ని చేకూర్చేలా ఉండనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.