Sanjay Raut : మహారాష్ట్రలో హిందీకి వ్యతిరేకంపై శివసేన యూటర్న్
Sanjay Raut : మహారాష్ట్ర రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసివచ్చారు.
- By Kavya Krishna Published Date - 06:18 PM, Sun - 6 July 25

Sanjay Raut : మహారాష్ట్ర రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసివచ్చారు. గతంలో రెండు దశాబ్దాలుగా నడుస్తున్న విభేదాలను పక్కనపెట్టి, హిందీ భాషా విధానాన్ని వ్యతిరేకించేందుకు ఒకే వేదికపై నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడో భాషగా ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో శనివారం ముంబైలో “వాయిస్ ఆఫ్ మరాఠీ” పేరుతో విస్తృతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహారాష్ట్రలో హిందీ భాషను శాసనాత్మకంగా ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని నిరసిస్తూ ప్రజలకి స్పష్టమైన సందేశం పంపించారు.
ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. “భాషా ఉద్యమం తమిళనాడు గడులు దాటి మహారాష్ట్రకి వచ్చిందన్నది గర్వకారణం,” అంటూ ఆయన పేర్కొన్నారు. ఠాక్రే సోదరుల ఐక్యతను స్వాగతించారు. బీజేపీ పాలనలో కేంద్రం హిందీని దేశవ్యాప్తంగా రుద్దే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
World Biryani Day : ఈరోజు ‘వరల్డ్ బిర్యానీ డే’ ..అసలు ఫస్ట్ ఎవరు ఇండియా కు తీసుకొచ్చారంటే !
అయితే, హిందీకి వ్యతిరేకతపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) స్పష్టతనిచ్చింది. పార్టీ ప్రధాన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ – “మహారాష్ట్రలో మేము హిందీ మాట్లాడుతాము. హిందీ సినిమాలు చూస్తాం, సంగీతాన్ని ఆస్వాదిస్తాం. కానీ, ప్రాథమిక విద్యాసంస్థల్లో హిందీని బలవంతంగా తేచే ప్రయత్నాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అది ప్రజల భాషా స్వాతంత్ర్యానికి విఘాతం కలిగిస్తుంది,” అని స్పష్టం చేశారు.
“హిందీకి వ్యతిరేకంగా పోరాడేవారంతా హిందీ మాట్లాడరన్న భావన తప్పు. ఇది భాషా విద్వేషం కాదు. ఇది భాషా దౌర్జన్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా ఉద్యమం” అని రౌత్ వివరణ ఇచ్చారు. హిందీని మూడో భాషగా ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడం మాత్రమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఠాక్రే సోదరుల ఐక్యత మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టైంది. స్టాలిన్ మద్దతుతో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. భాషా పరిరక్షణ, ప్రాంతీయ అస్మిత అంశాలు మళ్లీ దేశ రాజకీయాల్లో ప్రధానంగా తలెత్తుతున్నాయి.
Japan : అగ్నిపర్వతం బద్దలైంది, భూమి కంపించింది.. జపాన్‌లో రియో జోస్యం నిజమవుతుందా?