Foreign Boat : మహారాష్ట్ర తీరంలో అనుమానాస్పద పడవ కలకలం.. రాయ్‌గఢ్ జిల్లా హైఅలర్ట్‌లోకి
Foreign Boat : మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా తీర ప్రాంతంలో ఓ అనుమానాస్పద పడవ కనిపించడం భారీ ఉధ్రిక్తతకు దారి తీసింది.
- Author : Kavya Krishna
Date : 07-07-2025 - 12:08 IST
Published By : Hashtagu Telugu Desk
Foreign Boat : మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా తీర ప్రాంతంలో ఓ అనుమానాస్పద పడవ కనిపించడం భారీ ఉధ్రిక్తతకు దారి తీసింది. ఆదివారం రాత్రి రేవ్‌దండా సమీపంలోని కోర్లాయి ప్రాంతానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు హుటాహుటిన స్పందించి ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు.
ప్రాథమికంగా ఈ పడవపై విదేశీ గుర్తులు ఉన్నాయని, అదేమైనా విదేశీ మత్స్యకారులదా లేదా మరెవరిదా అన్నది ప్రస్తుతం దర్యాప్తులో భాగమని పోలీసులు తెలిపారు. ఈ పడవ తీరానికి కొట్టుకు రావడానికి తీవ్రమైన వర్షాలు, తుపాన్ల వల్ల ఏర్పడ్డ సముద్ర అలజడి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఉద్దేశ్యం ఏమిటన్నదీ భద్రతా సంస్థలకు గట్టి ప్రశ్నగా మారింది.
ఈ ఘటనపై అప్రమత్తమైన రాయ్‌గఢ్ పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ) బృందాలు, భారత నౌకా దళం (నేవీ) , కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించాయి. అయితే, తీవ్ర వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవ వరకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
బార్జ్ సహాయంతో పడవను సమీపించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా వాతావరణం సహకరించక వెనక్కి తిప్పవలసి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో హైఅలర్ట్ కొనసాగుతుండగా, ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి తీర ప్రాంతాన్ని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా దృష్ట్యా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
Kantara: రిషబ్ బర్త్‌డే గిఫ్ట్.. అదిరిన కొత్త లుక్, రిలీజ్ డేట్ ఫిక్స్.!