Article 370 : కశ్మీర్ ‘ప్రత్యేక హోదా’ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు ఇవాళే
Article 370 : 2019 ఆగస్టు 5.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని(Article 370) రద్దు చేసిన రోజు.
- By Pasha Published Date - 07:15 AM, Mon - 11 December 23

Article 370 : 2019 ఆగస్టు 5.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని(Article 370) రద్దు చేసిన రోజు. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలువురు ఆ ఏడాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఈ ధర్మాసనం 2023 ఆగస్టు 2 నుంచి ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. ఆ తీర్పును సోమవారం(డిసెంబరు 11న) వెలువరిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా శాంతిభద్రతలకు తమ పార్టీ విఘాతం కలిగించబోదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
- కేంద్రం నిర్ణయం చట్ట విరుద్ధమైందని సుప్రీం తీర్పు స్పష్టం చేస్తుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు రావచ్చని కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.