Freebies For Voters : ఎన్నికల వేళ ఉచితాలపై పిల్.. ఆ రాష్ట్రాలకు, కేంద్రానికి సుప్రీం నోటీసులు
Freebies For Voters : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు స్పందించింది.
- By Pasha Published Date - 02:08 PM, Fri - 6 October 23

Freebies For Voters : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. ఉచితాల పంపిణీపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర సర్కారు, ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులను పంపింది. ప్రజలు పన్ను రూపంలో చెల్లించే సొమ్మును రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ భట్టూలాల్ జైన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిల్ ను దాఖలు చేశారు.
సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు..
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్‌సింగ్ వాదనలు వినిపించారు. ‘‘ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు నగదును పంపిణీ చేయడం కంటే దారుణం మరొకటి ఉండదు. ఇది ప్రతిసారీ జరుగుతోంది. చివరకు ఈ భారం పన్ను చెల్లింపుదారులపై పడుతుంది’’ అని వాదించారు. ఉచితాలపై ఏర్పాటు చేసే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా ఉండాలని న్యాయవాది వికాస్‌సింగ్ కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ.. పదవీ విరమణ చేసిన వ్యక్తికి, పదవీ విరమణ చేయబోయే వ్యక్తికి ఈ దేశంలో విలువ ఉండదని అదే సమస్యని కామెంట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశం. దీనిపై చర్చ జరగాల్సిందే’’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ టాపిక్ పై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకు ఉచిత హామీలు ఆగబోవని (Freebies For Voters) అభిప్రాయపడింది.