Mahatma Gandhi : మహాత్మాగాంధీకి ప్రత్యేక రైల్వే బోగీ అంకితం.. విశేషాలివీ..
ఆ రైలు బోగీపై థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్‌మెంటు(Mahatma Gandhi) అని రాశారు.
- By Pasha Published Date - 04:31 PM, Wed - 11 September 24

Mahatma Gandhi : జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు ఆనాడు రైలుయాత్ర చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. అదే స్ఫూర్తిని మళ్లీ దేశ ప్రజల్లో నింపే లక్ష్యంతో కేంద్ర సాంస్కృతిక శాఖ నడుం బిగించింది. బ్రిటీష్ కాలం నాటి ఓ రైల్వే కోచ్‌ను పునరుద్ధరించి.. దానికి బ్రౌన్ రంగు పెయింటింగ్‌ను వేయించింది. ఆ రైలు బోగీపై థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్‌మెంటు(Mahatma Gandhi) అని రాశారు. ఆ రైలు బోగీ నుంచి మహాత్మాగాంధీ మెట్లు దిగుతున్నట్లుగా ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఇంత చక్కగా రూపుదిద్దిన ఈ రైలు బోగీని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ బుధవారం ఆవిష్కరించారు. రాజ్‌ఘాట్‌లోని గాంధీ దర్శన్ వద్ద ఈ రైలు బోగీని ప్రజల సందర్శనార్ధం ఏర్పాటు చేశారు. ఆనాడు బ్రిటీషర్ల పాలనలో భారతీయులను కేవలం థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించేందుకు అనుమతించేవారు. దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో గాంధీజీ అక్కడి రైల్వే స్టేషనులో ఆంగ్లేయుల నుంచి తీవ్ర వర్ణవివక్షను ఎదుర్కొన్నారు. ఆ వర్ణ వివక్షను రూపుమాపేందుకు ఆయన భారత్‌కు తిరిగొచ్చి ఒక గొప్ప స్వాతంత్య్ర పోరాటాన్ని నిర్మించారు.
Also Read :Palestine In UN : తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సీటు.. ఇజ్రాయెల్ భగ్గు
ఈసందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ.. ‘‘గాంధీజీ చనిపోయి 75 ఏళ్లు గడిచినా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. కేవలం భారత్‌కే కాకుండా యావత్ ప్రపంచానికి అవి మార్గదర్శక సూత్రాల లాంటివి’’ అని చెప్పారు. ఈ ప్రత్యేకమైన రైలు బోగీని రాజ్‌ఘాట్‌కు రైల్వేశాఖ విరాళంగా అందించిందని తెలిపారు. గాంధీజీ ఆనాడు చేసిన రైలు ప్రయాణం యావత్ దేశాన్ని ఏకంగా చేసిందని గుర్తు చేశారు. దేశ వికాసంలో, ఐక్యతలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.