Sonia vs Sushma: 1999 కర్ణాటక ఎన్నికల్లో సోనియా వర్సెస్ సుష్మా వార్
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచార కార్యక్రమాలతో యమబిజీగా గడుపుతున్నారు
- By Praveen Aluthuru Published Date - 11:56 AM, Mon - 24 April 23

Sonia vs Sushma: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచార కార్యక్రమాలతో యమబిజీగా గడుపుతున్నారు. అయితే కర్ణాటక ఎలెక్షన్స్ అంటే 1999 లో జరిగిన ఓ రాజకీయ రగడ గుర్తుకు వస్తుంది. అదీకూడా ఇద్దరు మహిళ నేతల మధ్య జరిగిన వార్.
1999లో అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి స్థానం నుంచి పోటీ చేశారు. ఈ సమయంలో బీజేపీ సుష్మా స్వరాజ్‌ను రంగంలోకి దించింది. ఈ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ తన వంతు కృషి చేశారు. సోనియా గాంధీని ఓడించేందుకు సుష్మా స్వరాజ్ వారం రోజుల్లోనే కన్నడ భాష నేర్చుకున్నారు. ఒకవైపు కన్నడ నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తూనే, మరోవైపు ఓటర్లను ఆకట్టుకున్నారు. కన్నడ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సుష్మా స్వరాజ్ కన్నడ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వారం రోజుల్లోనే ఈ భాషను నేర్చుకుని ఆ భాష ద్వారా ప్రజలకు చేరువయ్యారు. నిజానికి బళ్లారి కాంగ్రెస్ కు కంచుకోట.
1999 ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ర్యాలీలో పాల్గొన్నప్పుడు సుష్మా 20 నిమిషాల కన్నడ ప్రసంగాన్ని విని ఆయన కూడా ఆమె అభిమాని అయ్యారు. ఆ ప్రచార సభలో సుష్మాపై ప్రశంసలు కురిపించారు వాజ్ పేయి. అయితే ఆ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ ఓటమి చెందినప్పటికీ తన ఓటమి గురించి ఇప్పటికీ చర్చించుకుంటారు. దాదాపు 18 రోజుల పాటు ఇక్కడ ప్రచారం చేసిన సుష్మా ఈ 18 రోజుల్లో ‘స్వదేశీ వర్సెస్ ఫారినర్’ అనే అంశాన్ని లేవనెత్తారు.
గతంలో గెలుపు ఓటములకు లక్షల్లో తేడా ఉండే కర్ణాటకలోని బళ్లారి సీటు. సుష్మాస్వరాజ్ ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత 56,100 ఓట్ల తేడా మాత్రమే కనిపించింది. ఆనాడు బళ్లారి నుంచి బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చినా దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ కూటమికి మొత్తం 269 సీట్లు వచ్చాయి. నిజానికి 29 సీట్లు గెలిచిన టీడీపీ ఆ పార్టీకి మద్దతిచ్చింది. మరోవైపు కాంగ్రెస్‌కు 114 సీట్లు మాత్రమే దక్కాయి.