నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన వివాదమే ఈ కేసు. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి దీనిని ప్రారంభించారు.
- Author : Gopichand
Date : 16-12-2025 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
- నేషనల్ హెరాల్డ్ కేసులో బిగ్ ట్విస్ట్
- సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట
Sonia- Rahul Gandhi: డిసెంబర్ 16, 2025న నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ చేపట్టేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కావాలనుకుంటే తన దర్యాప్తును కొనసాగించవచ్చని కోర్టు పేర్కొంది.
ఛార్జ్‌షీట్‌లో ప్రముఖుల పేర్లు
ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారిలతో పాటు యంగ్ ఇండియన్, డోటెక్స్ మెర్కండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను నిందితులుగా పేర్కొంది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇది తీవ్రమైన ఆర్థిక నేరమని, ఇందులో ఫోర్జరీ, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.
Also Read: ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!
సోనియా-రాహుల్‌పై భారీ కుంభకోణం ఆరోపణలు
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. ‘యంగ్ ఇండియన్’ అనే ప్రైవేట్ కంపెనీ ద్వారా కేవలం రూ. 50 లక్షలకే దీనిని దక్కించుకున్నారని ఈడీ పేర్కొంది. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో 76% వాటా సోనియా, రాహుల్ గాంధీలకు ఉంది. ఈ కేసులో నేరం ద్వారా పొందిన ఆదాయం రూ. 988 కోట్లుగా ఈడీ నిర్ధారించింది. సంబంధిత ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 5,000 కోట్లు ఉంటుందని అంచనా.
ఆస్తుల జప్తు చర్యలు
ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ముందే ఏప్రిల్ 12, 2025న దర్యాప్తులో భాగంగా కుదువ పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ చేపట్టింది. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస ముంబైలోని బాంద్రా (ఈస్ట్), లక్నోలోని విశేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న AJL భవనాలకు ఈడీ నోటీసులు అంటించింది. రూ. 661 కోట్ల విలువైన ఈ స్థిరాస్తులతో పాటు, AJLకు చెందిన రూ. 90.2 కోట్ల విలువైన షేర్లను కూడా ఈడీ నవంబర్ 2023లో అటాచ్ చేసింది.
అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి?
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన వివాదమే ఈ కేసు. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి దీనిని ప్రారంభించారు. ఈ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ప్రచురించేది. ఆర్థిక నష్టాల వల్ల 2008లో ఈ పత్రిక మూతపడింది. ఆ తర్వాత ఈ సంస్థను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అక్రమాలు, కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.