One Nation One Election: ‘జమిలి ఎన్నికల’పై జేపీసీ తొలి సమావేశం
ఈసందర్భంగా ఆ రెండు బిల్లులలోని కీలక నిబంధనలను కేంద్ర న్యాయ శాఖ అధికారులు జేపీసీ సభ్యులకు(One Nation One Election) వివరించారు.
- By Pasha Published Date - 12:48 PM, Wed - 8 January 25

One Nation One Election: జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇవాళ తొలి సమావేశాన్ని నిర్వహించింది. దీనికి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి, మాజీ న్యాయ శాఖ సహాయ మంత్రి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆ రెండు బిల్లులలోని కీలక నిబంధనలను కేంద్ర న్యాయ శాఖ అధికారులు జేపీసీ సభ్యులకు(One Nation One Election) వివరించారు. సమావేశంలో ప్రియాంకా గాంధీ వాద్రా (కాంగ్రెస్), సంజయ్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే (శివసేన), సంజయ్ సింగ్ (ఆప్), కళ్యాణ్ బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) వంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల సభ్యులు పాల్గొన్నారు. జేపీసీ పరిశీలనలో ఉన్న రాజ్యాంగం (129వ సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను ఇటీవలే శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వాటిపై సమగ్రమైన చర్చ, అధ్యయనం కోసం జేపీసీకి పంపారు. జేపీసీలో మొత్తం 39 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో లోక్‌సభ నుంచి 27 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు.
Also Read :Formula-E Car Race Case : కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
జేపీసీలో కీలక సభ్యులు ఎవరు?
జమిలి ఎన్నికల బిల్లులపై అధ్యయనం చేస్తున్న జేపీసీలోని ముఖ్య సభ్యులలో మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పర్షోత్తమ్ రూపాలా, మనీష్ తివారితో పాటు ఎంపీలు అనిల్ బలూని, బన్సూరి స్వరాజ్, సంబిత్ పాత్ర ఉన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఆ రెండు బిల్లులలో పొందుపరిచారు. వాటిపై జేపీసీ సమగ్ర అధ్యయనం చేస్తుంది. న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆ బిల్లుల్లోని నిబంధనల అమలు సాధ్యాసాధ్యాలపై లోతైన పరిశీలన జరుపుతుంది.
Also Read :India Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదేనా?
జమిలి ఎన్నికల విధానం కొత్తదా?
1950లో మన దేశ రాజ్యాంగానికి ఆమోదం లభించింది. 1951 నుంచి 1967 మధ్యకాలంలో ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో కేంద్రం, రాష్ట్రాలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడటం, కొన్ని పాత రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ జరగడం వల్ల జమిలి ఎన్నికల పద్ధతికి మధ్యలో బ్రేక్ పడింది. 1968-1969 కాలంలో వివిధ రాష్ట్రాల శాసన సభలు రద్దయ్యాయి. దీంతో జమిలి ఎన్నికల ప్రాసెస్ అమలు ఆగిపోయింది.