Sharad Pawar : విపక్షాల ఐక్యతకు `శరద్ పవార్` ఫార్ములా
`ఉమ్మడి కనీస ప్రణాళిక` ఆధారంగా ఎన్నికలకు ముందుగా విపక్షాలు ఐక్యంగా ముందుకు నడిచే అవకాశం ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అంచనా వేస్తున్నారు.
- Author : CS Rao
Date : 01-09-2022 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
`ఉమ్మడి కనీస ప్రణాళిక` ఆధారంగా ఎన్నికలకు ముందుగా విపక్షాలు ఐక్యంగా ముందుకు నడిచే అవకాశం ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అంచనా వేస్తున్నారు. లోక్ సభ సాధారణ ఎన్నికల(2024) నాటికి `కామన్ మినిమం ప్రోగ్రామ్` తయారు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
ఎన్డీయే నుంచి నితీష్ కుమార్ బయటకు రావడాన్ని శుభపరిణామంగా శరద్ పవార్ అభివర్ణించారు. అదే, ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, సోనియాకు రాసిన లేఖ గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని దాటేసే ప్రయత్నం చేశారు. జేడీయూ పూర్వపు యూపీఏ భాగస్వామిగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ యూపీఏ భాగస్వామిగా నితీష్ రావడాన్ని ఆహ్వానించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దుర్వినియోగంపై విరుచుకుపడిన పవార్ “బిజెపి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలను డబ్బు, ఈడీ, సీబీఐ ఆధారంగా దించుతున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటకలో చేసిన విధంగానే జార్ఖండ్‌లో కూడా ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏకం కావాలని శరద్ పవార్ పిలుపునిచ్చారు.