Warren Buffett : పొదుపే సంపదకు మార్గం.. వారెన్ బఫెట్ పొదుపు సూత్రాలు యువతకు మార్గదర్శనం
యువతకు ముఖ్యమైన సందేశం ఇది. అవసరాలకూ, ఆడంబరాలకూ తేడా గుర్తించండి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. ఎక్కడ డబ్బు వృథా అవుతుందో తెలుసుకునే తెలివి కలవాడే నిజంగా డబ్బును దాచగలడని బఫెట్ అభిప్రాయపడుతున్నారు.
- By Latha Suma Published Date - 01:37 PM, Sat - 19 July 25

Warren Buffet t: “ఒక రూపాయి పొదుపు చేయడమంటే, ఆ రూపాయిని సంపాదించినట్టే” అని పెద్దలు చెబుతుంటారు. ఈ మాటలో గొప్ప సందేశం దాగి ఉంది. ఎంత సంపాదన ఉన్నా, ఖర్చులు అదుపులో పెట్టుకుంటే ధనవంతులయ్యే అవకాశం ఉంటుందని ప్రముఖ పెట్టుబడి నిపుణుడు వారెన్ బఫెట్ చెబుతున్నారు. ఆయన సూచనల ప్రకారం, ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమని, సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నామన్నదే అసలు విషయమని చెబుతున్నారు.
అవసరాలు vs ఆడంబరాలు
యువతకు ముఖ్యమైన సందేశం ఇది. అవసరాలకూ, ఆడంబరాలకూ తేడా గుర్తించండి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. ఎక్కడ డబ్బు వృథా అవుతుందో తెలుసుకునే తెలివి కలవాడే నిజంగా డబ్బును దాచగలడని బఫెట్ అభిప్రాయపడుతున్నారు. పొదుపు చేసిన తరువాతే ఖర్చులపై లెక్కలు వేసుకోవాలి, ఖర్చులన్నీ చేశాక పొదుపు చేయాలని అనుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు.
సొంతింటిపై ఆలోచన
ఉద్యోగంలో చేరిన తరువాత చాలామంది సొంతింటిపై కలలు కంటారు. ఈ కల నిజం కావచ్చు కానీ, అది ఆడంబరంగా కాక అవసరంగా ఉండాలి. చిన్న కుటుంబానికి చిన్న ఇల్లు సరిపోతుంది, కానీ మితిమీరిన ఇంటి కోసం డబ్బు వెచ్చించడం వల్ల భవిష్యత్ లో ఈఎంఐ, మెయింటెనెన్స్, ట్యాక్సుల రూపంలో ఎక్కువ భారం పడుతుంది. ఇల్లు అవసరానికి అనుగుణంగా ఉండాలి, గొప్పతనాన్ని చూపించేందుకు కాదు అని బఫెట్ సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డుల జాగ్రత్తలు
క్రెడిట్ కార్డులు సులభంగా దొరుకుతాయి కానీ, అవి సరైన అవగాహన లేకుండా వాడితే అప్పుల ఊబిలోకి నడిపిస్తాయని బఫెట్ హెచ్చరిస్తున్నారు. తెలివిగా వాడితే ప్రయోజనాలు ఉన్నాయి, లేకపోతే నెలాఖరులో బిల్లు చూసి చకితపడాల్సి వస్తుంది. వ్యయ నియంత్రణ లేకుండా చేసే షాపింగ్, చివరికి ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.
కారు కొనుగోలు – అవసరమా? ఆడంబరమా?
కారు కొనుగోలు చాలా మంది కల. బ్యాంకు రుణాల ద్వారా అది సులభంగా సాధ్యం కావచ్చు. కానీ బఫెట్ చెప్పినట్లు, జీతం పెరిగిందని వెంటనే కారు కొనే ఆలోచన మానుకోవాలి. ఎందుకంటే, కారు ఒక పెట్టుబడి కాదు ఖర్చు మాత్రమే. ఒకసారి షోరూం నుంచి కారు బయటికొస్తే దాని విలువ తగ్గుతూ పోతుంది. బఫెట్ ఇప్పటికీ 2014లో డిస్కౌంట్‌లో కొనుగోలు చేసిన కారునే వాడుతున్నారు. పెట్టుబడి వృద్ధి అయ్యే దానిలో పెట్టాలి, తగ్గే దానిలో కాదు.
లాటరీలు, జూదాలు – దూరంగా ఉండాలి
లాటరీల్లో గెలిచిన కథలు అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తాయి. కానీ అది చాలా అరుదైన అదృష్టం మాత్రమే. బఫెట్ చెప్పిన ప్రకారం, లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. బదులుగా చాలా మంది డబ్బు కోల్పోతుంటారు. జూదాల్లో గెలుపు కన్నా నష్టం శాతం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
పెట్టుబడులు – అవగాహనతోనే
ఎవరైనా చెప్పారనో, ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పారు అనో తెలియని స్కీమ్స్‌లో డబ్బు పెట్టొద్దని బఫెట్ ఖచ్చితంగా చెబుతున్నారు. మీకు అర్థమయ్యే పెట్టుబడుల్లోనే డబ్బు పెట్టాలి. “అధిక రిటర్న్ వస్తుంది” అనడం వెనుక అధిక రిస్క్ కూడా దాగి ఉంటుంది. పెట్టుబడులు చేసేముందు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. వారెన్ బఫెట్ చెప్పే ఈ ఆర్థిక సూత్రాలు జీవితాన్ని స్థిరంగా, భద్రంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. పొదుపుతో జీవించడం ఒక శైలి, అది యువతకు త్వరలోనే ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించగలదు. అవసరాలు గుర్తించండి, ఆదా చేయండి, అవగాహనతో పెట్టుబడులు పెట్టండి – ఇదే నిజమైన సంపదకు మార్గం.