RSS Chief : విభేదాలను పక్కనపెట్టి హిందువులు ఏకం కావాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్
ఆర్ఎస్ఎస్ పనితీరు యాంత్రికమైంది కాదని మోహన్ భగవత్ (RSS Chief) స్పష్టం చేశారు.
- By Pasha Published Date - 05:15 PM, Sun - 6 October 24

RSS Chief : హిందువులు తమ సొంత భద్రత కోసం ఏకం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. భాష, కులం, ప్రాంతం అనే విభేదాలను హిందువులు పక్కన పెట్టి ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించారు. ఐకమత్యంతోనే భద్రత లభిస్తుందని చెప్పారు. రాజస్థాన్‌లోని బరన్‌లో జరిగి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఐక్యత వల్ల దేశ వికాసం కూడా జరుగుతుందన్నారు.
Also Read :SBI Jobs : ఎస్‌బీఐలో 10వేల ఉద్యోగాల భర్తీ.. 600 కొత్త బ్రాంచీలు
ఆర్ఎస్ఎస్ పనితీరు యాంత్రికమైంది కాదని మోహన్ భగవత్ (RSS Chief) స్పష్టం చేశారు. ఆలోచన ఆధారితంగానే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంటుందని ఆయన చెప్పారు. ‘‘మనకు కుటుంబం ఎంత ముఖ్యమో.. సమాజమూ అంతే ముఖ్యం. అందుకే సామాజిక వికాసం దిశగా ఆర్ఎస్ఎస్ తమ కార్యకర్తలను ప్రోత్సహిస్తుంటుంది’’ అని తెలిపారు. సామాజిక వికాసానికి తోడ్పడితే మన జీవితం సార్థకం అవుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. ‘‘భారతదేశం హిందూదేశం. హిందూ అనే పదం దేశంలో నివసించే అన్ని వర్గాల ప్రజలను సూచిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. సమాజంలో పురోగతి సాధించాలంటే క్రమశిక్షణ, దేశభక్తి, లక్ష్యం తప్పక ఉండాలన్నారు. ఆర్ఎస్ఎస్ బోధించే విలువలు యావత్ దేశానికి ఎంతో దోహదం చేస్తాయని మోహన్ భగవత్ చెప్పారు. ఇక ఈ ప్రోగ్రాంలో 3827 మంది ఆర్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
Also Read :Ola CEO Vs Comedian : ఓలా సీఈఓ వర్సెస్ కమేడియన్ కమ్రా ట్వీట్ల యుద్ధం
గోవాలో ఆర్‌ఎస్‌ఎస్ నేత వ్యాఖ్యలపై దుమారం
బీజేపీ పాలిత రాష్ట్రం గోవాలో క్యాథలిక్ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్‌పై ఆర్‌ఎస్‌ఎస్ నేత సుభాష్ వెలింగ్‌కర్ చేసిన వ్యాఖ్యలపై క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ గోవాలోని చర్చికి సంబంధించిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌ను విమర్శించిన ఆర్‌ఎస్‌ఎస్ గోవా మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్‌కర్‌పై 12కుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదు. శనివారం స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెలింగ్‌కర్ దాఖలు చేశారు. అయితే అరెస్టు నుంచి మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.