Rohini Commission: బీసీ వర్గీకరణపై జస్టిస్ రోహిణి సంచలన నివేదిక
వెనుకబడిన కులాలను నాలుగు కేటరిగిరీలుగా వర్గీకరిస్తూ జస్టిస్ రోహిణి కమిషన్ సంచలన సిఫారస్సులను చేసింది.
- Author : CS Rao
Date : 30-04-2022 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
వెనుకబడిన కులాలను నాలుగు కేటరిగిరీలుగా వర్గీకరిస్తూ జస్టిస్ రోహిణి కమిషన్ సంచలన సిఫారస్సులను చేసింది. వేలాదిగా ఉన్న ఓబీసీలందరికీ న్యాయం జరగాలంటే వర్గీకరణ అవసరమని కమిషన్ తేల్చింది. భారత్ లో 2,633 ఓబీసీ కులాలు ఉన్నాయని లెక్కించింది. ఆ కులాలను ఓబీసీ 1, ఓబీసీ 2, ఓబీసీ 3, ఓబీసీ 4 కేటగిరీలుగా విభజించాలని కమిషన్ సూచించింది.
వెనుకబడిన వర్గాల్లోని ఉప కులాల పరిశీలన కోసం 2017లో జస్టిస్ జి.రోహిణి కమిషన్ ను కేంద్రం నియమించింది. ఆ మేరకు అధ్యయనం చేసిన రోహిణి కమిషన్ తుది నివేదికను శనివారం కేంద్రానికి అందచేసింది. కేటగిరి 1కు అత్యధికంగా 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారస్సు చేసింది.
వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ల కల్పించాలనే రాజకీయ పక్షాలతో సమావేశాలను నిర్వహించింది. ఆ తరువాత రోహిణి కమిషన్ ను అధ్యయనం కోసం నియమించగా ఉప కులాల్లో వర్గీకరణ అవసరమని తేల్చింది. వేల సంఖ్యలో ఉన్న ఓబీసీ కులాల మధ్య 27 శాతం రిజర్వేషన్ కోసం తీవ్రమైన పోటీ ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుని వర్గీకరణ ఆవశ్యకతను తెలియచేసింది.
తాజాగా జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన వర్గీకరణ నివేదికపై కేంద్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. నివేదికపై వివిధ రాజకీయ పక్షాలతో చర్చించాలని యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ కులాల రిజర్వేషన్ల అంశం రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మండల్ కమిషన్ ఆనాడు దేశ వ్యాప్తం ఎలాంటి చిచ్చు రేపిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ. కూడా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన సిఫారస్సుల మేరకు బీసీ వర్గీకరణ చేస్తే దేశ వ్యాప్తంగా గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది.