Rajiv Gandhi : రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషి సంతన్ మృతి.. ఎలా ?
Rajiv Gandhi : 1991లో జరిగిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరి పేరు టి.సుతేంద్రరాజా అలియాస్ సంతన్.
- By Pasha Published Date - 12:24 PM, Wed - 28 February 24

Rajiv Gandhi : 1991లో జరిగిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరి పేరు టి.సుతేంద్రరాజా అలియాస్ సంతన్. 56 ఏళ్ల వయసు కలిగిన సంతన్ చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. సంతన్‌తో పాటు ఈ కేసులో దోషులుగా తేలిన మొత్తం ఐదుగురు 32 సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించారు. చివరకు 2022 నవంబరులో వీరంతా రిలీజయ్యారు. ఈ దోషులంతా శ్రీలంక జాతీయులే. అయితే ప్రస్తుతం వీరి వద్ద శ్రీలంక పాస్‌పోర్ట్‌లు కానీ.. ప్రయాణ పత్రాలు కానీ లేవు. దీంతో తిరుచ్చి సెంట్రల్ జైలు క్యాంపస్‌లోని ప్రత్యేక శిబిరంలో ఉంటున్నారు. శ్రీలంకకు వెళ్లి తన ముసలి తల్లిని కలుస్తానని.. అందుకు అనుమతి ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టును సంతన్ ఆశ్రయించాడు.
We’re now on WhatsApp. Click to Join
కాలేయ వైఫల్య సమస్య కారణంగా సంతన్ ఈ ఏడాది జనవరిలోనే ఓ ఆస్పత్రిలో చేరాడు. క్రిప్టోజెనిక్ సిరోసిస్‌తో అతడు బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఫిబ్రవరి ప్రారంభంలో చెన్నైలోని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సంతన్‌ను చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సంతన్ బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డీన్ డాక్టర్ ఇ. థెరానీరాజన్ వెల్లడించారు. సంతన్ మరణించినప్పుడు అతడి సోదరుడు ఆస్పత్రిలోనే ఉన్నాడని తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం సంతన్ భౌతికకాయాన్ని శ్రీలంకలోని ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (FRRO) శ్రీలంకకు సంతన్ వెళ్లేందుకు అత్యవసర ప్రయాణ పత్రాన్ని ఫిబ్రవరి 23న అందించింది. ఈ పత్రాన్ని అందించిన కొన్ని రోజుల్లోనే సంతన్ ప్రాణాలు విడవడం గమనార్హం.
Also Read :Himachal Heat : కాంగ్రెస్ సర్కారుకు షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్
1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)కి అనుబంధంగా ఉన్న ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు.ఈ ఘటన జరిగిన తర్వాత మొత్తం ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. 1999 మేలో మురుగన్, సంతన్, పేరారివాలన్, నళినిలకు సుప్రీంకోర్టు మరణశిక్షలు విధించింది. పయస్, రవిచంద్రన్, జయకుమార్‌ల మరణశిక్షలను యావజ్జీవ కారాగారశిక్షకు తగ్గించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టయిన 26 మంది నిందితుల్లో 19 మందిని నిర్దోషులుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.