Golden Temple : స్వర్ణ దేవాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు
Golden Temple : గోల్డెన్ టెంపుల్‌ను పేల్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఈమెయిల్‌పై తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం భగవంత్
- By Sudheer Published Date - 08:08 AM, Tue - 15 July 25

పంజాబ్ లోని సిక్ఖుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్ (Golden Temple) కు బాంబు పేలుడు (bomb threat) బెదిరింపుల నేపథ్యంలో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. శిరోమణి గురుద్వారా ప్రవంధక్ కమిటీ (SGPC)కి ఒక ఈమెయిల్ రావడం, అందులో గోల్డెన్ టెంపుల్‌ను పేల్చేయనున్నామని పేర్కొనడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అమృత్‌సర్ పోలీసులు బాంబు నిర్వీర్య బృందాన్ని ఘటన స్థలానికి తరలించి పటిష్ట తనిఖీలు చేపట్టారు.
ఈమెయిల్ బెదిరింపులపై SGPC ఫిర్యాదు మేరకు అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ బెదిరింపులపై సైబర్ క్రైం విభాగంతో పాటు ఇతర విచారణా సంస్థలు జాగ్రత్తగా దర్యాప్తు ప్రారంభించాయి. ఈ మెయిల్ ఎక్కడి నుంచి పంపబడింది, దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రతి రోజూ లక్షకు పైగా భక్తులు గోల్డెన్ టెంపుల్‌ను సందర్శిస్తున్న నేపథ్యంలో, భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు.
ఈ ఘటనపై అమృత్‌సర్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్‌లా స్పందిస్తూ.. ఇది కేవలం ఒక మతస్థలానికి చెందిన బెదిరింపు మాత్రమే కాదు, ఇది శాంతి, విశ్వాసం, మానవత్వంపై దాడి అని అన్నారు. RDX పేలుడు పదార్థంతో గోల్డెన్ టెంపుల్‌ను పేల్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఈమెయిల్‌పై తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కి, డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అన్ని విభాగాలు హైఅలర్ట్‌లో ఉండాలని, భద్రత విషయంలో ఒక్క పొరపాటు జరగకూడదని ఆయన హెచ్చరించారు. “మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో మనమంతా ఏకతాటిపై నిలవాలి” అని అన్నారు.