Operation Sindoor : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
ఈ చర్యలలో భాగంగా పాక్‌లో నాలుగు, పీఓకేలో ఐదు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. బవహల్పూర్‌లో జైషే మహమ్మద్, మురిద్కేలో లష్కరే తొయిబా క్యాంపుల్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
- Author : Latha Suma
Date : 07-05-2025 - 3:01 IST
Published By : Hashtagu Telugu Desk
Operation Sindoor : పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ భారీ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు జరిపింది. ఈ చర్యలలో భాగంగా పాక్‌లో నాలుగు, పీఓకేలో ఐదు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. బవహల్పూర్‌లో జైషే మహమ్మద్, మురిద్కేలో లష్కరే తొయిబా క్యాంపుల్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
Read Also: Pakistan Airspace : ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాక్ ఎయిర్‌స్పేస్ ఖాళీ
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలసి, ఆపరేషన్ వివరాలు అందించారు. ఆపై భద్రతా పరిస్థితులపై సమగ్ర సమీక్ష జరిగింది. కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఆపరేషన్ అనంతర పరిణామాలపై వివరణ ఇవ్వడంతో పాటు, జాతీయ భద్రత విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తదితరులు హాజరుకానున్నారు.
భారత చర్యలను విపక్షాలు స్వాగతించాయి. ఉగ్రవాదంపై ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉన్నదని విపక్ష నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి, తాజా పరిస్థితులపై చర్చించనుంది. ఇదే సమయంలో హోం మంత్రి అమిత్‌షా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, డీజీలతో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించనున్నారు. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్ నుంచి ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.