PM Modi : రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారం సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 07:48 PM, Tue - 21 May 24

PM Modi : ఎన్నికల ప్రచారం సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. అణగారిన కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని చెప్పారు. మంగళవారం బిహార్‌లోని మోతీహరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని(PM Modi) ప్రసంగించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నెహ్రూ ఎన్నటికీ అంగీకరించేవారు కాదు. నెహ్రూ రిజర్వేషన్లపై తన అభిప్రాయాలను తెలుపుతూ అప్పట్లో ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో ఈవిషయం స్పష్టంగా ఉంది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో ఉన్న ప్రధానమంత్రులు అందరు కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. అది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కావచ్చు, వారంతా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ముందుకు సాగారు.ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఎన్నడూ కాంగ్రెస్ నుంచి గౌరవం పొందలేదు’’ అని ప్రధాని మోడీ ఆరోపించారు.
Also Read :Warangal Girl Record : పేద కుటుంబం నుంచి వరల్డ్ రికార్డ్ దాకా.. హ్యాట్సాఫ్ జీవన్‌జీ దీప్తి
బీజేపీకి 400కుపైగా లోక్‌సభ సీట్లు వస్తే రాజ్యాంగం మారిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రధాని మోడీ తప్పుపట్టారు. అలాంటి తప్పుడు ఆలోచనలను తమ పార్టీ చేయదని తేల్చి చెప్పారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ఓటర్లను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు సురక్షితంగా కంటిన్యూ కావాలంటే మళ్లీ బీజేపీ గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకు కోసం ఎలాంటి తప్పుడు ప్రచారానికైనా వెనకడుగు వేయడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రచారం నైతికంగా, ప్రజలను మెప్పించేలా ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు.