Suryoday Yojana Scheme : ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోడీ భారీ పథకం ప్రకటన..
- By Sudheer Published Date - 10:07 PM, Mon - 22 January 24

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని (Suryoday Yojana Scheme) ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. దీని ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లులు తగ్గుతాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఇంధన రంగంలో భారతదేశం రూపురేఖలు మారతాయని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
“ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ సూర్యవంశానికి చెందిన భగవంతుడు శ్రీరాముడి నుంచి శక్తిని పొందుతారు. ఈరోజు, అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ని ప్రారంభించనుంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా చేస్తుంది’’ అని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అలాగే మోడీ తన నివాసంలో దీపాలు వెలిగించారు. రామ ప్రతిష్ట అపూర్వ ఘట్టం సందర్భంగా సాయంత్రం వేళ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, దుకాణాల్లో దీపాలు వెలిగించాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి రామ భక్తిని చాటుకున్నారు. ఇక నేడు అయోధ్య లో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కన్నులపండుగగా జరిగింది. వేదపండింతులు చెప్పిన ముహుర్తానికే విగ్రహ ప్రతిష్ట చేసారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూలల నుండి ఎంతమంది భక్తులు , పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
Read Also : Ayodhya Ram Mandir Inauguration : వెల్లివిరిసిన మతసామరస్యం..