Odisha : మూత్రాన్ని వాటర్ అనుకోని తాగిన అధికారి..అసలు ఏంజరిగిందంటే !!
Odisha : ఒడిశాలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సచిన్ గౌడకు, నిందితుడైన ప్యూన్ సిబా నారాయణ్ నాయక్ ఈ మూత్ర బాటిల్‌ను అందించాడు
- By Sudheer Published Date - 09:09 AM, Sat - 2 August 25

ఒడిశా(Odisha)లోని గణపతి జిల్లాలో ఒక షాకింగ్ ఘటన సంచలనం సృష్టించింది. ఒక ఉన్నతాధికారికి తాగునీటి బదులు, ఆ కార్యాలయంలో పనిచేసే ప్యూన్ మూత్రం బాటిల్ ఇచ్చాడు. అది తాగిన అధికారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు సదరు ప్యూన్‌ను అరెస్ట్ చేశారు. ఒడిశాలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సచిన్ గౌడకు, నిందితుడైన ప్యూన్ సిబా నారాయణ్ నాయక్ ఈ మూత్ర బాటిల్‌ను అందించాడు. జూలై 23న ప్రభుత్వ కార్యాలయంలో ఈ అమానుష ఘటన జరిగినట్లు సమాచారం.
జులై 23వ తేదీ రాత్రి అధికారి సచిన్ గౌడ ప్యూన్ సిబా నారాయణ్ నాయక్‌ను మంచి నీరు అడిగారు. అయితే, నీటికి బదులుగా సిబా నారాయణ్ నాయక్ మూత్రం ఉన్న బాటిల్‌ను సచిన్ గౌడకు అందించాడు. రాత్రి సమయం కావడం, తక్కువ వెలుగు ఉండటంతో సచిన్ గౌడ ఆ బాటిల్‌లోని ద్రవాన్ని గుర్తించకుండానే తాగాడు. అనంతరం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం బెర్హంపూర్‌లోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో అధికారి సచిన్ గౌడ చెప్పిన విషయాల ఆధారంగా ఆయన తాగిన బాటిల్‌లోని ద్రవాన్ని పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఆ ద్రవంలో అమ్మోనియా సాంద్రత సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని వైద్యులు నిర్ధారించారు. తనతో పాటు మరో ఇద్దరు అధికారులు కూడా ఇదే ద్రవాన్ని తాగారని, దాని రుచి, నాణ్యత గురించి ఇలాంటి ఆందోళనలే వ్యక్తం చేశారని గౌడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నిందితుడైన ప్యూన్ సిబా నారాయణ్ నాయక్‌పై కేసు నమోదు చేశారు. ఈ పని చేయడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.