Nitin Gadkari : అమెరికా సంపన్నదేశంగా అవతరించడానికి కారణమేంటో తెలుసా? కేంద్ర మంత్రి గడ్కరీ ఏం చెప్పారంటే..
అమెరికా ఎందుకు సంపన్న దేశంగా పిలవబడుతుందో, ఆ స్థాయికి ఎలా చేరిందో గడ్కరీ చెప్పారు.
- By News Desk Published Date - 08:30 PM, Mon - 22 May 23

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) సోమవారం రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా హనుమగఢ్ జిల్లాలోని పక్క షర్న గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 2050 కోట్ల వ్యయంతో సేతు బంధన్ లో భాగంగా నిర్మాణం చేపట్టనున్న ఆరు జాతీయ హైవే ప్రాజెక్టులు, ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా కేంద్రం అన్నివిధాల కృషి చేస్తుందని గడ్కరీ చెప్పారు.
దేశంలో దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరగాలని అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతుందని గడ్కరీ చెప్పారు. 2024చివరి నాటికి రాజస్థాన్లోని రోడ్లు అమెరికా రహదారులతో సమానంగా ఉంటాయని రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నానని గడ్కరీ అన్నారు. రోడ్లు నిర్మాణం వల్ల రాజస్థాన్ సుసంపన్న రాష్ట్రంగా మారుతుందని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా ఎందుకు సంపన్న దేశంగా పిలవబడుతుందో, ఆ స్థాయికి ఎలా చేరిందో గడ్కరీ చెప్పారు.
అమెరికా ధనిక దేశం అయినందువల్ల అక్కడ రోడ్లు బాగున్నాయని అనుకోవద్దని, రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా సుసంపన్న దేశంగా అవతరించిందని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన మాటలను గడ్కరీ గుర్తు చేశారు. మంచి రోడ్లు ఉండటం వల్లనే అమెరికా సంపన్నదేశంగా అవతరించిందని, భారతదేశంలోనూ అన్ని రాష్ట్రాల్లో మెరుగైన రవాణాకు రహదారులను నిర్మిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.
Also Read : Kollu Ravindra : పేర్ని నాని కొడుకుని ప్రమోట్ చేయడానికే ఈ సభ.. కొల్లు రవీంద్ర కామెంట్స్..