NEET PG Exam : ‘నీట్-పీజీ’ పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం తయారీ !
ఇటీవల వాయిదా వేసిన నీట్-పీజీ పరీక్షను ఆగస్టు మూడోవారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
- By Pasha Published Date - 08:44 AM, Wed - 3 July 24

NEET PG Exam : ఇటీవల వాయిదా వేసిన నీట్-పీజీ పరీక్షను ఆగస్టు మూడోవారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం నేపథ్యంలో నీట్-పీజీ పరీక్ష విషయంలో ఎగ్జామినేషన్స్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నీట్ పీజీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని రెడీ చేసి విడుదల చేస్తారని అంటున్నారు. పరీక్ష ప్రశ్నాపత్రం రెడీ అయిన వెంటనే ఆన్‌లైన్‌లో పరీక్ష కేంద్రాలకు పంపుతారట. ప్రశ్నపత్రం లీకేజీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దుమారం రేగడంతో జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను(NEET PG Exam) కూడా వాయిదా వేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘నీట్-యూజీ’లో అవకతవకలపై 8 నుంచి విచారణ
నీట్-యూజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాలపై దాఖలైన 26 పిటిషన్లపై ఈ నెల 8 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వీటిని విచారించనుంది. ఈమేరకు సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో తాజా అప్‌డేట్ వచ్చింది.
Also Read :Karna : మహాభారతంలో కర్ణుడు హీరో ఎందుకు కాలేకపోయాడు?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం రోజు లోక్‌సభలో తొలిసారిగా స్పందించారు. దేశంలో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆటలాడే వారిని వదిలిపెట్టబోమని వెల్లడించారు. నీట్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. నీట్-యూజీ పేపర్ లీక్‌పై తీవ్ర విచారం వ్యక్తం చేశానని, పేపర్ లీక్‌కు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని విద్యార్థులకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.