Morbi Bridge : యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో తప్పించుకునే యత్నం ?
- By Naresh Kumar Published Date - 04:29 AM, Thu - 3 November 22

మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మరమ్మతులు చేపట్టిన సంస్థ అనుభవరాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం కలిసి.. వందల మందిని బలితీసుకున్నాయా.. ? యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట అసలు దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..?
గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి మరమ్మతుల పనులు అప్పగించడం.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పెను విషాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆ పనిలో కనీస అర్హత లేదని తేలింది.
మరమ్మతుల సమయంలో వంతెన ఫ్లోరింగ్‌కు మార్చారు. కానీ తీగలను మార్చకుండా వదిలేశారు. కొత్త ఫ్లోరింగ్‌ను 4 లేయర్ల అల్యూమినియం షీట్లతో చేశారు. దీంతో పాత తీగలు ఈ బరువు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలిసింది. ఇక ఈ మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఈ పనుల్లో ఎలాంటి అర్హత పత్రాలు లేవు. అయినప్పటికీ 15 ఏళ్లపాటు అంటే 2037 వరకు కేబుల్ బ్రిడ్జి నిర్వహణ బాధ్యతలను ఒరేవా కంపెనీకి అప్పగించారు అధికారులు.
తీగల వంతెన మరమ్మతులకు కనీసం ఏడు నెలలు పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
అయితే ఐదు నెలల్లోనే రిపేర్ పనులు పూర్తి చేసి హడావుడిగా వంతెనను ప్రారంభించింది ఒరేవా సంస్థ. అధికారుల నుంచి ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్లు తీసుకోకుండానే దీపావళి టైమ్‌లో కేబుల్ బ్రిడ్జిని తిరిగి తెరిచారు. ఆ తర్వాత 4 రోజులకే ఘోరం జరిగిపోయింది. వంతెనకు కనీసం పదేళ్లు ఢోకా లేదని ప్రకటించిన ఒరేవా కంపెనీ ఎండీ.. ప్రమాదం తర్వాత పత్తా లేకుండా పోయాడు. పోలీసుల FIRలోనూఈ సంస్థ యజమానుల పేర్లు లేవు. దీనిపై ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ చిదంబరం. పేర్లు మోర్బీ బ్రిడ్జి కూలిన కేసులో మొత్తం 9 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో నలుగురిని పోలీసు కస్టడీకి అప్పగించింది స్థానిక కోర్టు. ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లను కస్టడీకి పంపింది. మిగిలిన 5గురికి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించింది.
ప్రమాదం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఒరేవా మేనేజర్లు కోర్టుకు చెప్పడం చూస్తే, అసలు దొంగలను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో నిందితులు తరపున వాదించకూడదని మోర్బీ, రాజ్‌కోట్ బార్ అసోసియేషన్లు నిర్ణయించాయి.మోర్బీలోని మచ్చునదిపై కేబుల్ బ్రిడ్డి కూలిన ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినం పాటించింది గుజరాత్ ప్రభుత్వం. అసెంబ్లీ, సెక్రటేరియట్ సహా గుజరాత్ ప్రభుత్వాఫీసులన్నింటిపైనా జాతీయ జెండాను అవనతం చేశారు అధికారులు.