Prithvi Shaw Case: పృథ్వి షా పై దాడి కేసు… కస్టడీకి మోడల్
ముంబైలో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
- Author : Naresh Kumar
Date : 18-02-2023 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
Prithvi Shaw Case: ముంబైలో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దాడికి పాల్పడిన మోడల్ సప్న గిల్ ను ముంబై పోలీసులు కస్టడీకి తరలించారు. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదనే కారణంతో షాపై సప్నాతో పాటు తన మిత్రబృందం కర్రలతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని విలే పార్లే ఈస్ట్‌లో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో పృథ్వీ షాని సెల్ఫీ ఇవ్వాలని కోరగా అందుకు అతడు నిరాకరించాడు. అయినా కూడా సప్న గిల్ గ్యాంగ్ సెల్ఫీ అడుగుతూ ఇబ్బందికి గురి చేసింది. గమనించిన హోటల్ సిబ్బంది వారిని బయటకు పంపించేశారు. దీన్ని అవమానంగా భావించిన సప్న .. షా ప్రయాణిస్తున్న కారును వెంబడించి..అతనిపై దాడికి పాల్పడింది.
అతడి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సప్నను అరెస్టు చేసిన పోలీసులు నేడు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సప్నాను నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఈనెల 20 దాకా ఆమె కస్టడీలోనే ఉండనుంది.
కాగా ఈ ఘటన తర్వాత స్వప్న ఎవరు అనే దానిపై నెటిజన్లు తెగ సోధిస్తున్నారు. చండీగఢ్ కు చెందిన స్వప్న మోడలింగ్ లో రాణిస్తూనే ఇన్‌స్టాలో రీల్స్, ఫోటో షూట్లతో ఫేమస్ అయింది. భారత్ లో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీలో ఆమె నటిగా రాణిస్తోంది. భోజ్‌పురిలో పలు సినిమాలు కూడా చేసిన ఆమెకు ఇన్‌స్టాలో 2.24 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీడియోలు, పొట్టి డ్రెస్సులతో చేసే ఫోటో షూట్లతో పాపులర్ అయింది.