Manmohan Singh’s Funeral : మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం..?
Manmohan Singh : కాంగ్రెస్ అభ్యర్థనను పక్కన పెట్టి, ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్‌లోనే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది
- By Sudheer Published Date - 09:21 PM, Fri - 27 December 24

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై(Manmohan Singh’s Funeral) కేంద్రం, కాంగ్రెస్ మధ్య వివాదం (Controversy between Center and Congress) తలెత్తినట్లు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) స్మారకార్థం ఢిల్లీలో ప్రత్యేక స్థలం కేటాయించాలని కాంగ్రెస్ కోరగా, కేంద్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు సమాచారం.
కాంగ్రెస్ అభ్యర్థనను పక్కన పెట్టి, ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్‌లోనే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. రేపు ఉదయం 11.45 గంటలకు సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు రక్షణ శాఖకు ఏర్పాట్ల కోసం కేంద్రం ఆదేశాలు పంపించింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ వంటి గొప్ప నాయకుడికి ఢిల్లీలో ప్రత్యేక స్థలం కేటాయించి, స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం ఆయనకు శ్రద్ధాంజలిగా నిలుస్తుందని అభిప్రాయపడుతోంది. ఇందుకు సంబంధించి కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని ఖర్గే తన లేఖలో ప్రధాని మోదీని కోరారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీకి సమాచారం ఇచ్చకుండా నిగమ్బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థకు చేసిన సేవలను గుర్తిస్తూ ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం ఆయనకు నిజమైన నివాళి అవుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశానికి ఘన సేవలందించిన మన్మోహన్ సింగ్ వంటి నేతకు ఆహార్యమైన గౌరవం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు విషయంలో కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : Loan App Harassment : యువతి న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లు.. ఇద్దరు అరెస్ట్..