Mahila Samman Savings : మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్..
Mahila Samman Savings : ప్రత్యేకంగా మహిళా ఇన్వెస్టర్ల కోసం రూపొందించిన ఈ పథకం వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమ్‌లో ఉంటుందని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 03:28 PM, Sat - 11 January 25

మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ (Mahila Samman Savings Certificate (MSSC) సర్టిఫికెట్ పొదుపు పథకాన్ని ప్రవేశ పెట్టింది. 2023 బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రత్యేకంగా మహిళా ఇన్వెస్టర్ల కోసం రూపొందించిన ఈ పథకం వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమ్‌లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద మహిళలు కనీసం రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మహిళల్లో పొదుపు అలవాటు పెంచడంతో పాటు, పెట్టుబడులు పెట్టే మాధ్యమంగా నిధులను సేకరించడం. ఈ పథకానికి 2 ఏళ్ల టెన్యూర్ ఉండగా, ప్రస్తుతం దీనిపై 7.50% వడ్డీ రేటు అందుబాటులో ఉంది. వడ్డీని ప్రతి 3 నెలలకు లెక్కించి, మెచ్యూరిటీ సమయంలో అసలుతో కలిపి చెల్లిస్తారు. ఈ పథకంలో డబ్బు జమ చేయడానికి బ్యాంకులు లేదా పోస్టాఫీసులను సంప్రదించవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడంలో ఆధార్ మరియు పాన్ కార్డ్ వంటి కేవైసీ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ పథకంలో పెట్టుబడి చేసిన ఏడాది తర్వాత 40% వరకు డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తి నిధులు రెండు సంవత్సరాల తర్వాతే పొందవచ్చు. ఉదాహరణకు, గరిష్ట పెట్టుబడిగా ₹2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీకి రూ. 32,044 వడ్డీ పొందవచ్చు. అదే రూ.1 లక్ష జమ చేస్తే రూ.16,022 వడ్డీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీ రేటు అందుబాటులో ఉండటం ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రధాన కారణం.
ఇదే బ్యాంకుల టర్మ్ డిపాజిట్లను పరిశీలిస్తే, ఎస్‌బీఐలో సాధారణ ప్రజలకు 6.80% వడ్డీ రేటు ఉండగా, సీనియర్ సిటిజెన్లకు 7.30% ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7% రేటు అందిస్తుండగా, యాక్సిస్ బ్యాంక్ 7.10% వడ్డీ రేటు ఇస్తోంది. పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లలో కూడా 7% రేటు అందుబాటులో ఉంది. అయితే సాధారణ ప్రజలకు మరియు మహిళా ఇన్వెస్టర్లకు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం మరింత లాభదాయకంగా ఉంటుంది.
2025 మార్చి 31నే ఈ పథకం గడువు తీరనుంది. తద్వారా, ఈ పథకంలో చేరాలని భావించే మహిళా ఇన్వెస్టర్లు ఆలోచన లేకుండా త్వరగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
Read Also : Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్!