Supreme Court WhatsApp : సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్.. ఎలా వినియోగించనున్నారో తెలుసా ?
Supreme Court WhatsApp : ఇకపై వాట్సాప్ సేవలను కూడా సుప్రీంకోర్టు వాడుకోనుంది.
- By Pasha Published Date - 02:58 PM, Thu - 25 April 24
Supreme Court WhatsApp : ఇకపై వాట్సాప్ సేవలను కూడా సుప్రీంకోర్టు వాడుకోనుంది. కేసుల లిస్టింగ్, ఫైలింగ్, విచారణకు సంబంధించిన వివరాలను ఆయా న్యాయవాదులకు వాట్సాప్ ద్వారా పంపించనుంది. న్యాయ సేవల్ని మరింత సులభతరం చేసేందుకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌తో అనుసంధానించిన తర్వాత న్యాయవాదులకు ఆటోమేటెడ్‌గా వారి కేసులతో ముడిపడిన సమాచారం మెసేజ్‌ల రూపంలో అందుతుంది. కోర్టులో ఓ రోజులో ఏయే కేసుల విచారణ జరుగుతుందో చెప్పేదే కాజ్ లిస్ట్. ఈ కాజ్ లిస్టులు పబ్లిష్ అయిన తరవాత ఆ కాపీలను కూడా వాట్సాప్ ద్వారా న్యాయవాదులకు పంపుతారు. ఇప్పటికే సుప్రీంకోర్టులోని కీలక వ్యక్తి వాట్సాప్ నంబర్‌ని అందరికీ ఇచ్చారు. అయితే ఆ నంబర్‌కి మెసేజ్‌లు చేయడం, కాల్స్ చేయడం కుదరదు. అన్ని వివరాలనూ ప్రింట్ తీసి అందరికీ ఇవ్వడం వల్ల పేపర్‌లు వృథా అవుతు న్నాయని, కొంత వరకూ వాటి వాడకాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ఈ-కోర్ట్ ప్రాజెక్టును కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం అమలు చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేయనుంది.
We’re now on WhatsApp. Click to Join
‘‘75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోనున్న ఈ ఏడాదిలోనే సుప్రీంకోర్టు(Supreme Court WhatsApp) కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ సేవల్ని సులభతరం చేయడంలో భాగంగా సుప్రీంకోర్టులోని ఐటీ సర్వీస్‌లను వాట్సాప్‌తో అనుసంధానించనున్నాం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అనే కేసుపై విచారణ జరుగుతున్న టైంలో ఈవివరాలను చంద్రచూడ్ ప్రకటించారు.ఈ నిర్ణయంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘‘ఇదో చరిత్రాత్మకమైన నిర్ణయం’’ అని పేర్కొన్నారు.