Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కూలిపోవడానికి కారణం ఇదే!
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) లో రికార్డైన సంభాషణలో ఒక పైలట్ మరొక పైలట్‌ను "నీవు ఎందుకు కటాఫ్ చేశావు?" అని ప్రశ్నించగా రెండో పైలట్ "నేను కటాఫ్ చేయలేదు" అని సమాధానం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 09:07 AM, Sat - 12 July 25

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి (Ahmedabad Plane Crash) సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే రెండు ఇంజన్లకు ఇంధన సరఫరాను నిలిపివేసేలా ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ‘రన్’ నుంచి ‘కటాఫ్’ స్థితికి మారాయి. ఈ సంఘటన టేకాఫ్ అయిన 3 సెకన్ల తర్వాత 08:08:42 UTC సమయంలో జరిగింది. ఇంజన్ 1, ఇంజన్ 2 ఫ్యూయల్ కటాఫ్ స్విచ్‌లు ఒక సెకను వ్యవధిలో వరుసగా ఆఫ్ అయ్యాయి. దీంతో ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయి, విమానం థ్రస్ట్ కోల్పోయి, ఎత్తు కోల్పోవడం ప్రారంభించింది.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) లో రికార్డైన సంభాషణలో ఒక పైలట్ మరొక పైలట్‌ను “నీవు ఎందుకు కటాఫ్ చేశావు?” అని ప్రశ్నించగా రెండో పైలట్ “నేను కటాఫ్ చేయలేదు” అని సమాధానం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ సంభాషణ ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అయిన వెంటనే జరిగింది. ఆ తర్వాత, 08:08:52 UTC వద్ద ఇంజన్ 1 ఫ్యూయల్ కటాఫ్ స్విచ్ తిరిగి ‘రన్’ స్థితికి మార్చబడింది. 4 సెకన్ల తర్వాత ఇంజన్ 2 స్విచ్ కూడా ‘రన్’ స్థితికి మార్చారు. అయినప్పటికీ ఇంజన్ 1 రీలైట్ కాగా, ఇంజన్ 2 పూర్తిగా రికవరీ కాలేకపోయింది. దీంతో విమానం కూలిపోయింది.
Also Read: SBI Report: ట్రంప్ టారిఫ్ పెంచడానికి కారణం ఏమిటి? ఎస్‌బీఐ నివేదికలో షాకింగ్ విషయాలు!
08:09:05 UTC వద్ద ఒక పైలట్ “మేడే మేడే మేడే” అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు డిస్ట్రెస్ కాల్ చేశాడు. ATC అధికారి విమానం కాల్ సైన్ గుర్తించమని అడిగినప్పటికీ.. ఎలాంటి స్పందన రాలేదు. 08:09:11 UTC వద్ద విమానం ఎయిర్‌పోర్ట్ పరిధి వెలుపల బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ సమీపంలో కూలిపోయింది. నివేదిక ప్రకారం.. ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అవడం వెనుక ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక అనుకోకుండా జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. యాంత్రిక లోపం లేదా బర్డ్ స్ట్రైక్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు కనుగొనబడలేదు.
ప్రాథమిక నివేదికలో బోయింగ్ 787-8 లేదా GE GEnx-1B ఇంజన్లకు సంబంధించి ఎలాంటి భద్రతా సిఫార్సులు జారీ చేయలేదు. ఇది యాంత్రిక లోపం కంటే పైలట్ చర్యలపై దృష్టి సారిస్తున్నట్లు సూచిస్తుంది. ఈ ఘటనకు ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.