One Country..One Election : ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ఈరోజు JPC మీటింగ్
One Country..One Election : ' ఈ జమిలి ఎన్నికలపై JPC కమిటీ సమావేశాలు ఇంకా కొన్ని వారాలు కొనసాగనున్నాయి. తర్వాత రాజకీయ పార్టీల నేతలతో, ఎన్నికల కమిషన్ అధికారులతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం
- By Sudheer Published Date - 07:45 AM, Wed - 30 July 25

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక (One Nation, One Election)’ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలను సమీకరించేందుకు కమిటీ ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే చట్టవ్యవస్థ, రాజ్యాంగ నిపుణులతో భేటీ అయిన JPC, ఈరోజు ఆర్థిక నిపుణులతో సమావేశం కానుంది.
నేడు జరిగే సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్త ఎన్.కే.సింగ్, ఇతర ఆర్థిక నిపుణులు JPC ఎదుట తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. జమిలి ఎన్నికలు అనేది దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ఉద్దేశం. దీని వల్ల ఖర్చులు తగ్గుతాయా? పరిపాలనలో స్థిరత్వం వస్తుందా? వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రజాధనం వినియోగం, ఎన్నికల నిర్వహణలో సమర్థతపై ఆర్థిక రంగం నుంచి JPC సూచనలు ఆశిస్తోంది.
ఈ నెల 11న జరిగిన సమావేశంలో, JPC సభ్యులు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ జె.ఎస్. ఖేహర్, డీవై చంద్రచూడ్ వంటి లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఒకేసారి ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా సాధ్యమా? దానికి అవసరమైన సవరణలు ఏమిటి? అనేవి ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. లీగల్ నిపుణులు కొన్ని సవరణలు అవసరమవుతాయని సూచించినట్లు సమాచారం.
ఈ జమిలి ఎన్నికలపై JPC కమిటీ సమావేశాలు ఇంకా కొన్ని వారాలు కొనసాగనున్నాయి. తర్వాత రాజకీయ పార్టీల నేతలతో, ఎన్నికల కమిషన్ అధికారులతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రజల్లోనూ దీనిపై చర్చ కొనసాగుతుండగా, JPC సమావేశాలు కీలక మలుపు తీసుకున్నాయి.