JNU : జేఎన్‌యూలో వామపక్షాల జయభేరి.. అధ్యక్షుడిగా ధనుంజయ్.. ఎవరు ?
JNU : ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం అభ్యర్థులు మరోమారు ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
- By Pasha Published Date - 08:05 AM, Mon - 25 March 24

JNU : ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం అభ్యర్థులు మరోమారు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. జేఎన్‌యూ ఎస్‌యూ(JNU) అధ్యక్ష ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి ఉమేశ్ చంద్రపై లెఫ్ట్ అభ్యర్థి ధనుంజయ్ గెలిచారు. ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ పదవులన్నీ లెఫ్ట్ అభ్యర్థులే దక్కించుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
కరోనా ఎఫెక్ట్ కారణంగా నాలుగేండ్ల గ్యాప్ తర్వాత జరిగిన జేఎన్‌యూఎస్‌యూ-2024 ఎన్నికలు మార్చి 22న జరిగాయి. దీని ఫలితాలు ఆదివారం రాత్రే వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 7 వేలమందికిపైగా జేఎన్‌యూ విద్యార్థులు ఓటేశారు. వామపక్షాల మద్దతు కలిగిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎ్‌సఏ), డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్ఎఫ్), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఐఎస్‌ఎఫ్) కూటమి ఘన విజయం సాధించింది.
Also Read : GT vs MI: ముంబైకి గుజరాత్ షాక్.. గెలుపు ముంగిట బోల్తా పడ్డ పాండ్య టీమ్
దాదాపు 30 ఏళ్ల తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్‌కు వామపక్ష విద్యార్థి గ్రూపుల నుంచి తొలి దళిత అధ్యక్షుడిగా ధనుంజయ్ ఎన్నికయ్యారు.
- చివరిసారిగా 1996-97లో దళిత వర్గానికి చెందిన బట్టి లాల్ బైర్వా JNUSU అధ్యక్షుడు అయ్యారు.
- JNUSU అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) అభ్యర్థి ఉమేష్ సీ అజ్మీరా 1,676 ఓట్లు సాధించగా.. 2,598 ఓట్లు సాధించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అభ్యర్థి ధనుంజయ్ గెలిచారు.
- ధనుంజయ్ బిహార్‌లోని గయా వాస్తవ్యుడు.
- ఆయన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
- JNUSU ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా ధనుంజయ్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యా నిధుల ఏజెన్సీ (HEFA) నుంచి విశ్వవిద్యాలయాలు తీసుకుంటున్న రుణాల కారణంగా ఫీజులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో నీరు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. దేశద్రోహ ఆరోపణల కింద అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.