బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ
మోదీ ఝల్‌మురి తిన్న ఉదంతంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఇదంతా ఓ డ్రామా అని, ఎన్నికల గిమ్మిక్ అని కొట్టిపారేశారు.
- Author : Gopi
Date : 23-04-2026 - 2:08 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi Slams TMC: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ‘ఝల్‌మురి’ (మరమరాల చాట్) హాట్ టాపిక్‌గా మారింది. రోడ్డు పక్కన బండి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ పౌరుడిలా ఝల్‌మురి ఆరగించడం.. అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ లో అగ్గి రాజేసింది. “నేను ఝల్‌మురి తింటే.. ఆ కారం టీఎంసీకి తగిలింది” అంటూ మోదీ సెటైర్లు వేస్తుండగా.. “ఇదంతా కెమెరాల ముందు ఆడుతున్న స్క్రిప్ట్ డ్రామా” అంటూ మమతా బెనర్జీ ఎదురుదాడికి దిగారు. స్నాక్స్ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ మాటల యుద్ధం ఇప్పుడు బెంగాల్ ఓటర్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఝల్‌మురి తిన్నది నేను.. కారం తగిలింది టీఎంసీకి: మోదీ
గురువారం కృష్ణానగర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీపై సెటైర్లు వేశారు. “నేను ఝల్‌మురి తింటే టీఎంసీకి గట్టి షాక్ తగిలినట్లుంది. నేను ఆ స్నాక్ తిన్నాను కానీ.. ఆ కారం (ఝల్) మాత్రం టీఎంసీకి తగిలింది” అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మే 4న బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని, ఆ రోజు మిఠాయిలతో పాటు ఝల్‌మురి కూడా పంచుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఐదు దశాబ్దాల రాజకీయాల్లో బెంగాల్‌లో ఇంత తక్కువ హింసతో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో దఫా చర్చలు?
ఇదంతా ఒక స్క్రిప్ట్ డ్రామా: మమతా బెనర్జీ
మోదీ ఝల్‌మురి తిన్న ఉదంతంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఇదంతా ఓ డ్రామా అని, ఎన్నికల గిమ్మిక్ అని కొట్టిపారేశారు. “అనుకోకుండా ఆగినప్పుడు అక్కడ అన్ని కెమెరాలు ఎలా ఉన్నాయి? ఇదంతా ముందుగా రాసుకున్న స్క్రిప్ట్. ప్రధాని జేబులో పది రూపాయల నోటు ఉండటం నమ్మదగ్గ విషయమేనా? ఇదంతా ఎస్పీజీ ఆధ్వర్యంలో జరిగిన సెట్టింగ్” అని ఆమె ఆరోపించారు.
ఆహారపు అలవాట్లపై దీదీ కౌంటర్
మమతా బెనర్జీ తన ర్యాలీల్లో బీజేపీపై విమర్శలు కొనసాగించారు. “మీకు హఠాత్తుగా ఝల్‌మురిపై ప్రేమ పుట్టుకొచ్చింది సరే.. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపలు, మాంసం తినకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. ఎవరి ఆహారపు అలవాట్లను తాము శాసించబోమని, తాము గెలిచిన తర్వాత బెంగాల్‌కు వచ్చిన బీజేపీ నేతలందరికీ నువ్వుల లడ్డూలు (తిలెర్ నారు), పాల లడ్డూలు (ఖీరర్ నారు) పంపిస్తానని ఆమె ఎద్దేవా చేశారు.