Jagdeep Dhankhar resigns as Vice President : ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ దన్ఖడ్..కారణం అదే !!
Jagdeep Dhankhar resigns as Vice President : అనారోగ్య కారణాలు తెలిపినా, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది
- By Sudheer Published Date - 10:19 PM, Mon - 21 July 25

ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా తన పదవి (Jagdeep Dhankhar resigns as Vice President)కి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలు తెలిపినా, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన ఆయన, పదవిలో కొనసాగడం ఇక తన వల్ల కాదని తెలిపారు. 2022లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ధన్ఖడ్, అదే ఏడాది ఆగస్టు 11న బాధ్యతలు చేపట్టి, ఇప్పటివరకు మూడు సంవత్సరాలు సేవలందించారు. మరో రెండేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ మధ్యలో రాజీనామా చేయడం గమనార్హం.
బెంగాల్ గవర్నర్‌గా 2019 నుంచి 2022 వరకు ఉన్న జగదీప్ ధన్ఖడ్ అప్పుడే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తరచూ ఎదురుదెబ్బలు, రాజ్‌భవన్ కేంద్రంగా రాజకీయ వ్యూహాలు ఆయనను వివాదాల కేంద్రమయ్యేలా చేశాయి. ఆ తరువాత ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్, తన స్పష్టమైన అభిప్రాయాలతో, కొంతమంది ఎంపీలపై గట్టి వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచారు. అయితే పదవిలో ఉన్న సమయంలో విపక్షాల నుండి తీవ్ర విమర్శలు రావడం, ఆయనపై అవిశ్వాస నోటీసు ఇవ్వడం చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.
Income Tax Bill : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ధన్ఖడ్ రాజీనామా ప్రకటన చేయడం పెద్ద సంచలనం అయింది. సభలో ఆయన చేసిన చివరి ప్రసంగంలో రాజకీయాల్లో పరస్పర గౌరవం, శ్రద్ధ అవసరం అని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు సహజమే కానీ, దేశ ప్రయోజనాల విషయంలో ఒకే దారి పట్టాలి అని స్పష్టం చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్లే తన రాజీనామాకు కారణమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ధన్ఖడ్ వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు మొదటి నుంచీ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన బీజేపీ వాదాలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డాయి. ఆయనపై అవిశ్వాస తీర్మానం దాఖలు చేయడం స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఈ పరిణామాల నేపథ్యంలో ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా పెద్ద మైలురాయి అవుతోంది. కొత్త ఉపరాష్ట్రపతిని ఎంపిక చేయడం, తదుపరి రాజకీయ పరిణామాలు ఏమిటనేది వేచి చూడాలి.