Income Tax Bill : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
Income Tax Bill : బీజేపీ నేత బైజయంత్ పండా నేతృత్వంలోని 31 మంది సభ్యులతో కూడిన కమిటీ, మొత్తం 566 సిఫారసులతో కూడిన 4,575 పేజీల నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టింది
- By Sudheer Published Date - 09:22 PM, Mon - 21 July 25

ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) 1961ను భర్తీ చేసే కొత్త “ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025″పై పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ కీలక సిఫారసులు చేసింది. బీజేపీ నేత బైజయంత్ పండా నేతృత్వంలోని 31 మంది సభ్యులతో కూడిన కమిటీ, మొత్తం 566 సిఫారసులతో కూడిన 4,575 పేజీల నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో పన్ను చెల్లింపుదారులకు మేలు చేసే విధంగా కొన్ని మార్పులు ప్రతిపాదించబడ్డాయి. ముఖ్యంగా గడువు మిస్ అయినా టీడీఎస్ రీఫండ్ పొందేందుకు అవకాశం కల్పించాలని సూచించడమే కాక, లాభాపేక్షలేని సంస్థలకు పన్ను మినహాయింపులు కొనసాగించాలని తెలిపింది.
ఇప్పటివరకు మతపరమైన, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించే ట్రస్టులకు అనామక విరాళాలపై పన్ను మినహాయింపు ఉంది. కానీ కొత్త బిల్లులో ఈ మినహాయింపులు కేవలం మతపరమైన ట్రస్టులకు మాత్రమే పరిమితం చేయాలని సూచించడంతో విద్యా, వైద్య సేవల వంటి దాతృత్వ సంస్థలు దెబ్బతినే అవకాశముందని కమిటీ హెచ్చరించింది. వీటి పట్ల కూడా మినహాయింపులు వర్తింపజేయాలని, లేదంటే ఆ సంస్థల ఆదాయంపై 30 శాతం పన్ను విధింపు తప్పుడు పరిణామాలను తీసుకురావచ్చని తెలిపింది.
Old Trafford: మాంచెస్టర్‌లో భారత్‌ను దెబ్బ కొట్టేందుకు ఇంగ్లాండ్ ‘గడ్డి’ వ్యూహం!
ఇంకా ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) రీఫండ్ కోసం తప్పనిసరిగా రిటర్న్ దాఖలు చేయాలన్న నిబంధనను తొలగించాలని కమిటీ తెలిపింది. పన్ను పరిధిలోకి రాని చిన్న ఉద్యోగులు, దినసరి కార్మికులు ఇలా చాలా మంది అనవసరంగా పన్ను కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వారికి న్యాయం చేయాలంటే గడువు దాటినా రీఫండ్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఇలాంటి మార్పులతో చాలా మంది చిన్నపాటి ఆదాయదారులకు ఊరట కలిగే అవకాశముంది.
ఇక 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15, 2025 వరకు గడువు ఉంది. ఇప్పటికే కోటి 50 లక్షల మందికిపైగా తమ రిటర్నులు ఫైల్ చేశారని సమాచారం. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చి రిటర్నులు ఫైల్ చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. సెలెక్ట్ కమిటీ సిఫారసులు అమలైతే, పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా మారనుంది.