Shubhanshu Shukla: వింత జీవితో అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా
ఆక్సివోమ్-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా తనకు తోడుగా ఒక జీవిని(Shubhanshu Shukla) కూడా తీసుకెళ్తున్నారు.
- By Pasha Published Date - 03:34 PM, Sun - 20 April 25

Shubhanshu Shukla: ‘గగన్‌యాన్’.. భారతదేశ తొలి మానవసహిత అంతరిక్షయాత్ర. దీన్ని 2026 సంవత్సరం చివరి త్రైమాసికం (అక్టోబరు – డిసెంబరు)లో నిర్వహించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోనే అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆక్సివోమ్ స్పేస్ కంపెనీతో మన ఇస్రో చేతులు కలిపింది. స్పేస్ ఎక్స్, నాసా కంపెనీలు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన కంపెనీయే ఆక్సివోమ్ స్పేస్. ఈ ఉమ్మడి కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సివోమ్ మిషన్ -4 ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2025 సంవత్సరం మే 29న పలువురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్నారు. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సివోమ్ మిషన్ -4 రాకెట్‌ను ప్రయోగిస్తారు. దీని ద్వారా ఇస్రోకు చెందిన శుభాంశు శుక్లా, ఆక్సివోమ్ ఉద్యోగి పెగ్గీ వైట్సన్, మిషన్ స్పెషలిస్ట్ స్లావోజ్ ఉజ్నాన్ స్కీ విస్కీవ్ స్కీ, హంగరీకి చెందిన టిబోర్ కాపు, పోలాండ్‌కు చెందిన ఓ వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతారు.
Also Read :Thackerays Reunion: ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలవబోతున్నారా ? ఇరుపార్టీల విలీనమా ?
కంటికి కనిపించనంత చిన్నసైజులో..
ఆక్సివోమ్-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా తనకు తోడుగా ఒక జీవిని(Shubhanshu Shukla) కూడా తీసుకెళ్తున్నారు. దాని పేరే.. వాయేజర్ టార్డిగ్రేడ్స్. దీన్ని నీటి ఎలుగుబంటి లేదా నాచు పందిపిల్ల అని పిలుస్తారు. వాయేజర్ టార్డిగ్రేడ్స్ అనేది ఒక సూక్ష్మజీవి. దీన్ని మనం సూక్ష్మదర్శిని లేకుండా చూడలేం. అంతచిన్న సైజులో ఉంటుంది. వాయేజర్ టార్డిగ్రేడ్స్ చిన్నగా ఉన్నా.. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నీరు, మంచు, అగ్ని, శూన్యం, రేడియేషన్, అంతరిక్షం లాంటి విభిన్న పరిస్థితుల్లోనూ ఇది జీవించగలదు. వాయేజర్ టార్డిగ్రేడ్స్‌కు ఎనిమిది కాళ్లు ఉంటాయి. ఎలుగుబంటులా మెల్లగా నడుస్తుంది.
Also Read :Indravelli Martyrs : ఇంద్రవెల్లి ఘటనకు 44 ఏళ్లు.. తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం
వాయేజర్ టార్డిగ్రేడ్‌పై రీసెర్చ్
ఆక్సివోమ్-4 మిషన్‌లో భాగంగా వ్యోమగామి శుక్లా ఈ టార్డిగ్రేడ్‌తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు గడుపుతారు. వాయేజర్ టార్డిగ్రేడ్ జీవి పునరుజ్జీవనం, మనుగడ, పునరుత్పత్తిపై అక్కడ రీసెర్చ్ చేస్తారు. ఈ వింత జీవులు అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీలో ఎలా ఉంటాయి ? గుడ్లు ఎలా పెడతాయి ? అనేది అధ్యయనం చేస్తారు. అంతరిక్ష వాతావరణంలో గడిపిన తర్వాత వాయేజర్ టార్డిగ్రేడ్ డీఎన్ఏలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుంటారు.