Tej Pratap Yadav : ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు.. తండ్రికి షాక్ ఇచ్చిన తేజ్ ప్రతాప్ యాదవ్..!
ఆయన తాజాగా ‘టీమ్ తేజ్ ప్రతాప్’ అనే కొత్త రాజకీయ దిశను ప్రారంభించారు. మహువా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న సంకేతాలిచ్చారు. తాజా ర్యాలీలో ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న జెండాలను మద్దతుదారులు ఊపుతూ "టీమ్ తేజ్ ప్రతాప్" అని రాసిన బ్యానర్‌ను ప్రదర్శించారు.
- By Latha Suma Published Date - 01:25 PM, Fri - 11 July 25

Tej Pratap Yadav : బీహార్ రాజకీయాల్లో పరిస్థితులు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన, మాజీ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ తాజా పరిణామాలతో రాష్ట్ర రాజకీయం మరో మలుపు తీసుకుంది. సొంత పార్టీ ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు నిజమైన షాక్ ఇచ్చారు. ఆయన తాజాగా ‘టీమ్ తేజ్ ప్రతాప్’ అనే కొత్త రాజకీయ దిశను ప్రారంభించారు. మహువా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న సంకేతాలిచ్చారు. తాజా ర్యాలీలో ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న జెండాలను మద్దతుదారులు ఊపుతూ “టీమ్ తేజ్ ప్రతాప్” అని రాసిన బ్యానర్‌ను ప్రదర్శించారు. తేజ్ ప్రతాప్ కూడా తన సిగ్నేచర్ గ్రీన్ క్యాప్‌తో ప్రజల్లో ఉత్సాహం నింపారు. మహువాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయనకు అభిమానులు హృదయపూర్వక స్వాగతం పలికారు. రాజకీయాల్లోకి 2015లో అడుగుపెట్టిన తేజ్ ప్రతాప్, అప్పటి నుంచి తనదైన శైలిలో ప్రచారాలు సాగిస్తూ వస్తున్నారు.
Read Also: Hindustan Unilever : కంపెనీ 92 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా సీఈవోగా ప్రియా నాయర్ రికార్డ్
ఈ ర్యాలీలో ఆయన ఇచ్చిన ప్రసంగం అత్యంత ఆసక్తికరంగా మారింది. “నేను ఇకపై ఎవరూ నియంత్రించేలా పనిచేయను. ప్రజల నిర్ణయమే నాకు ఫైనల్. వారు కోరిన చోట నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ తన స్వతంత్ర రాజకీయ మార్గానికి బలమైన సంకేతాలిచ్చారు. తండ్రి పార్టీ నుంచి తండ్రే బహిష్కరించడం, ఆ తర్వాత కొడుకు పూర్తిగా కొత్త పార్టీ వైపు మళ్లడం బీహార్ రాజకీయాల్లో విశేష చర్చనీయాంశంగా మారింది. తాజాగా తేజ్ ప్రతాప్‌కు ఆరేళ్లపాటు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి కారణంగా తేజ్ ప్రతాప్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు పేర్కొనబడుతున్నాయి. అనుష్క యాదవ్ అనే మహిళతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన తేజ్ ప్రతాప్, తాను ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిపారు. కానీ ఆ తరువాత వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేశారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని వివరణ ఇచ్చిన తేజ్ ప్రతాప్ నమ్మకంతో షేర్ చేశాను కానీ దుర్వినియోగమయ్యింది అని స్పందించారు.
ఇక దీనిపై తీవ్రంగా స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ పరువు దెబ్బతినేలా వ్యవహరించిన తన పెద్ద కుమారుడితో ఇకపై ఎటువంటి సంబంధాలు ఉండవని ప్రకటించారు. రాజకీయంగా కాదు, కుటుంబ పరంగా కూడా తేజ్ ప్రతాప్‌ను పూర్తిగా తొలగించడం ద్వారా లాలూ తమ వైఖరిని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తేజ్ ప్రతాప్ తానే ఒక నాయకుడిగా ప్రజల ముందుకు వస్తూ, తన స్వంత పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఇది. బీహార్ ప్రజలు, ముఖ్యంగా యువత, తేజ్ ప్రతాప్ కొత్త ప్రయాణానికి ఎలా స్పందిస్తారు? వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంత వరకు ఉంటుంది? ఇవన్నీ సమయానుకూలంగా తేలనున్నారు.