Indias Polar Ship : ప్రపంచం అంచుల్లో రీసెర్చ్ కోసం ఇండియా నౌక!
Indias Polar Ship : వచ్చే ఐదేళ్లలో మన దేశానికి మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెసెల్ (పీఆర్‌వీ) అందుబాటులోకి రానుంది.
- By Pasha Published Date - 10:42 AM, Sat - 12 August 23

Indias Polar Ship : వచ్చే ఐదేళ్లలో మన దేశానికి మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెసెల్ (పీఆర్‌వీ) అందుబాటులోకి రానుంది. మంచుఖండం అంటార్కిటికాలో మన దేశానికి ఉన్న భారతి, మైత్రి, దక్షిణ గంగోత్రి పరిశోధనా కేంద్రాలకు ఈ పోలార్ రీసెర్చ్ నౌక చేదోడుగా ఉండనుంది. పరిశోధన, రవాణా అవసరాల కోసం దీన్ని వాడుకోనున్నారు. ఈ నౌకను రూ.1,051 కోట్లతో కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి దీనికి సంబంధించిన బడ్జెట్ మంజూరుకు 2014లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన టెండర్ కూడా పిలిచారు. అయితే నౌకను నిర్మించడానికి ఆర్డర్ పొందిన కంపెనీ టెండర్ ప్రక్రియలో భాగం కాని కొన్ని షరతులను లేవనెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేసింది.
తాజాగా ఈ నౌక ధరను రూ. 2,600 కోట్లకు పెంచారు. ఈమేరకు EFC (వ్యయ ఆర్థిక కమిటీ) కొత్త ప్రతిపాదనను రెడీ చేసిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రూ. 2,600 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పోలార్ రీసెర్చ్ నౌక నిర్మాణ ప్రతిపాదనను క్యాబినెట్ ముందుకు తీసుకెళ్తామని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఇండియాకు పోలార్ రీసెర్చ్ నౌక(Indias Polar Ship) అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.