Fighter Jet Crashes : మరో విమాన ప్రమాదం..ఈసారి ఎక్కడంటే !!
Fighter Jet Crashes : ఇటీవల ఇలాంటి విమాన ప్రమాదాల ఘటనలు తరచూ నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. పక్షులు ఢీకొనడం వల్ల విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి
- By Sudheer Published Date - 03:02 PM, Wed - 9 July 25

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లా రతన్‌గఢ్ సమీప భానుడా గ్రామంలో బుధవారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధవిమానం (Jaguar Fighter Jet) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అలాగే మరో ఇద్దరు వైమానిక సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద స్థలానికి రక్షణ శాఖ అధికారులు వెంటనే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో భారీ శబ్దం వినిపించిందని తెలిపారు. అనంతరం జాగ్వార్ యుద్ధవిమానం పొలాల్లో కుప్పకూలడంతో భారీ మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన నేపథ్యంలో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వైమానిక దళం ప్రత్యేక బృందం ఘటనాస్థలికి చేరుకుని పరిశీలన చేపట్టింది. యుద్ధవిమానాల్లో సాధారణంగా అత్యాధునిక పరికరాలు ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
UAE Golden Visa : యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన
ఇక మరోవైపు బుధవారం మరొక విమాన ప్రమాదం తప్పింది. పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో ప్రయాణికుల విమానాన్ని గాల్లో పక్షి ఢీకొట్టింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానంలో ఉన్న 169 మంది ప్రయాణికులకు అపాయం తప్పింది. పైలట్ అప్రమత్తంగా స్పందించి విమానాన్ని వెంటనే పాట్నా ఎయిర్‌పోర్టుకు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రమాదానికి గురైన విమానాన్ని ప్రస్తుతం మరమ్మతులకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల ఇలాంటి విమాన ప్రమాదాల ఘటనలు తరచూ నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. పక్షులు ఢీకొనడం వల్ల విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఇటీవలే పాట్నా నుంచి రాంచీకి వెళ్లే ఇండిగో విమానాన్ని గాల్లో గద్ద ఢీకొన్న ఘటన కూడా తీవ్ర భయాందోళన కలిగించింది. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ పైలట్ చాకచక్యంగా విమానాన్ని రాంచీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.