Expenditure Survey : ఆహారం కంటే వినోదానికే ఎక్కువ ఖర్చు.. గృహ వినియోగ వ్యయ సర్వే విశేషాలు
Expenditure Survey : కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో దేశ ప్రజల కొనుగోలు శక్తి, వ్యయాల తీరుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- By Pasha Published Date - 04:25 PM, Sun - 25 February 24

Expenditure Survey : కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో దేశ ప్రజల కొనుగోలు శక్తి, వ్యయాల తీరుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం.. గత పదేళ్లలో మన దేశంలో గృహ వ్యయం రెండింతలు పెరిగింది. గృహ వ్యయంలో ఎక్కువ భాగం బట్టలు, టెలివిజన్ సెట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక ఇదే సమయంలో ఆహార పదార్థాలపై దేశ ప్రజల ఖర్చు తక్కువగా ఉందని సర్వేలో తేలింది. గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23లో భాగంగా మొత్తం 2,61,746 కుటుంబాలను సర్వే(Expenditure Survey) చేశారు. వీటిలో 1,06,732 కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో, 1,55,014 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
- దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల నెలవారీ వ్యయంలో ఆహార ఖర్చుల వాటా 2011-12లో 53 శాతంగా ఉండేది. అది కాస్తా 2022-23 నాటికి 46.4 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ఆహారేతర ఖర్చుల వాటా 47 శాతం నుంచి 53.6 శాతానికి పెరిగింది.
- దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజల నెలవారీ వ్యయంలో ఆహార ఖర్చుల వాటా 2011-12లో 42.6 శాతం ఉండగా.. అది 2022-23 నాటికి 39.2 శాతానికి క్షీణించింది. ఇదే సమయంలో ఆహారేతర ఖర్చుల వాటా 57.4 శాతం నుంచి 60.8 శాతానికి పెరిగింది.
- 2022-23లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం రూ. 6,459 కు చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో అది రూ.3,773కి పెరిగింది.
- గత 18 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం ఆరు రెట్లు పెరిగింది. ఇది పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువ.
- 2004-05లో గ్రామీణ ప్రాంతాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం రూ.579, పట్టణాల్లో రూ.1,105 ఉండేది. ఇది ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 552 శాతం, పట్టణ ప్రాంతాల్లో 484 శాతం మేర పెరిగింది.
- 2022-23లో దేశంలోని గ్రామీణ జనాభాలో అట్టడుగు స్థాయిలో ఉన్న 5 శాతం మంది సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం రూ.1,373 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.2,001గా ఉంది. అదే పై స్థాయిలో ఉన్న 5 శాతం మంది సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501, పట్టణ ప్రాంతాల్లో రూ. 20,824గా నమోదైంది.
Also Read : Food Crisis : గాజాలో ఆహార సంక్షోభం.. ఆకలి తీరుస్తున్న కలుపుమొక్క గురించి తెలుసా ?
- రాష్ట్రాల వారీగా చూస్తే.. సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం సిక్కింలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,731 కాగా, పట్టణాల్లో రూ.12,105గా నమోదైంది.
- సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం ఛత్తీస్‌గఢ్‌లో అత్యల్పంగా గ్రామాల్లో రూ.2,466, పట్టణాల్లో రూ.4,483గా ఉంది.
- సగటు నెలవారీ ఆహార ఖర్చులు మనదేశంలోని గ్రామాల్లో రూ.1,750, పట్టణాల్లో రూ.2,530కాగా.. ఆహారేతర ఖర్చులు గ్రామాల్లో రూ.2,023, పట్టణాల్లో రూ.3,929గా ఉన్నాయి.