ULFA – Assam CM : ఉల్ఫా తీవ్రవాద సంస్థతో శాంతి ఒప్పందం.. ఎప్పుడంటే ?
ULFA - Assam CM : తీవ్రవాదంతో 1979 సంవత్సరం నుంచి అసోంలో అలజడిని సృష్టిస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)తో శాంతి చర్చల దిశగా అడుగులు ముందుకుపడుతున్నాయి.
- By Pasha Published Date - 09:59 AM, Sun - 17 December 23

ULFA – Assam CM : తీవ్రవాదంతో 1979 సంవత్సరం నుంచి అసోంలో అలజడిని సృష్టిస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)తో శాంతి చర్చల దిశగా అడుగులు ముందుకుపడుతున్నాయి. ఉల్ఫా తీవ్రవాద గ్రూపులో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం అతివాదాన్ని సమర్ధిస్తుండగా.. మరో వర్గం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఉల్ఫా తీవ్రవాద సంస్థలోని మితవాద గ్రూపుతో అసోం సర్కారు, కేంద్ర సర్కారు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈవిషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ప్రకటించారు. ఈ నెలాఖరుకల్లా లేదా జనవరిలో అరన్‌బిందా రాజ్‌ఖోవా సారథ్యంలోని ఉల్ఫా మితవాద గ్రూపుతో శాంతి ఒప్పందం ఖరారు అవుతుందని ఆయన వెల్లడించారు. ఉల్ఫాలోని అతివాద గ్రూపుతోనూ చర్చలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆ తీవ్రవాద సంస్థలోని రెండు గ్రూపులూ శాంతి ఒప్పందంతో కలిసి వస్తే.. అసోంలో అభివృద్ధికి బ్రేక్ అనేది ఇక ఉండదని సీఎం హిమంత వ్యాఖ్యానించారు. పరేష్ బారుహ్ నేతృత్వంలోని ఉల్ఫా (ఐ) అతివాద గ్రూపుతోనూ విస్తృత చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ తపన్ దేకా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) డైరెక్టర్ దినకర్ గుప్తాతో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన ఈ వివరాలను అసోం సీఎం హిమంత బిస్వ శర్మ(ULFA – Assam CM) మీడియాకు వెల్లడించారు. మరోవైపు మయన్మార్‌కు చెందిన రొహింగ్యా ముస్లింలు చొరబడినట్లుగా అనుమానిస్తున్న 44 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు చేసింది.