Uttar Pradesh : రైల్వే ప్లాట్‌ఫాంపై హెయిర్ క్లిప్పు, చిన్నకత్తితో ప్రసవం..ఆర్మీ డాక్టర్ పై ప్రశంసలు
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించిన డాక్టర్ రోహిత్, అక్కడి రైల్వే సిబ్బందితో కలిసి తక్షణమే మహిళకు డెలివరీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అక్కడ ఎటువంటి వైద్య పరికరాలు లేకపోయినా, కేవలం తన దగ్గర ఉన్న హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్ సహాయంతో ప్రసవం విజయవంతంగా జరిపాడు.
- By Latha Suma Published Date - 04:05 PM, Mon - 7 July 25

Uttar Pradesh : ఒక డాక్టర్ తమ వృత్తి నెపధ్యంలో చూపించగలిగే అత్యుత్తమ విలువలు ఏమిటో మేజర్ డాక్టర్ రోహిత్ బచ్‌వాలా తాజాగా చేసిన పనితో చాటిచెప్పారు. ఆర్మీలో డాక్టర్‌గా సేవలందిస్తున్న హైదరాబాదీ రోహిత్ తన సమయస్ఫూర్తితో ఒక ప్రాణాపాయ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించి మానవత్వానికి అర్థం తెలిపాడు. ఈ ఉదంతం తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వయంగా స్పందించి, అతని సేవలను కొనియాడారు. ఈ నెల 5న మేజర్ డాక్టర్ రోహిత్ ఝాన్సీలోని మిలిటరీ ఆస్పత్రిలో విధులు ముగించుకుని స్వస్థలమైన హైదరాబాద్‌కు తిరిగే పనిలో ఉన్నాడు. ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వేచి చూస్తున్న సమయంలో ఒక అసాధారణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అదే సమయంలో పాన్‌వెల్ నుంచి ఘోరఖ్‌పూర్‌కు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను అత్యవసరంగా ఝాన్సీ స్టేషన్‌లో దింపగా, నొప్పులు భరించలేక ఆమె రైల్వే ప్లాట్‌ఫారంపై కుప్పకూలింది.
Read Also: Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించిన డాక్టర్ రోహిత్, అక్కడి రైల్వే సిబ్బందితో కలిసి తక్షణమే మహిళకు డెలివరీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అక్కడ ఎటువంటి వైద్య పరికరాలు లేకపోయినా, కేవలం తన దగ్గర ఉన్న హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్ సహాయంతో ప్రసవం విజయవంతంగా జరిపాడు. ప్లాట్‌ఫారంపైనే అత్యవసరంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక ఏర్పాటులో మేజర్ రోహిత్ తల్లీబిడ్డలను క్షేమంగా ప్రసవింపజేసి వారి ప్రాణాలు కాపాడాడు. ప్రసవం పూర్తయిన తర్వాత, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించిన రోహిత్, తాత్కాలికంగా హెయిర్ క్లిప్‌తో బొడ్డుతాడును లాక్ చేసి, పాకెట్ నైఫ్‌తో తుడిచి కత్తిరించాడు. ఆ గర్భిణి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే వారిని అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన అనంతరం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ డాక్టర్ రోహిత్ హైదరాబాద్ బయలుదేరాడు. అయితే, అప్పటికే ఈ ఉదంతం అక్కడి రైల్వే సిబ్బందిలో, ప్రయాణికుల్లో ఒక ఉద్వేగాన్ని సృష్టించింది. సమయానికి ఆయన స్పందించిన తీరుపై వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయం భారత ఆర్మీ ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. భారత ఆర్మీ నూతన చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వయంగా డాక్టర్ రోహిత్‌ను అభినందిస్తూ ఆయన చూపిన తక్షణ స్పందన, నిస్వార్థ నిబద్ధత నిజంగా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఓ మిలిటరీ డాక్టర్ చేసే పని మాత్రమే కాదు, ఇది ఒక అసలైన నాయకుడి, సేవాభావం ఉన్న వ్యక్తి చేసే పని అని ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ రోహిత్ చేసిన ఈ కర్తవ్య పరాయణ చర్య సోషల్‌మీడియాలో కూడా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. నెటిజన్లు ‘రిఅల్ హీరో’, ‘డాక్టర్ ఆన్ డ్యూటీ ఎవరైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒక్కసారి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే మార్గంలో కూడా కర్తవ్యం ముందే అన్న మనస్థత్వాన్ని చూపించిన మేజర్ రోహిత్ బచ్‌వాలా ఇప్పుడు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Read Also: Assam : కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో హృదయాన్ని కదిలించే సంఘటన