GST: సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Author : Latha Suma
Date : 13-08-2024 - 3:09 IST
Published By : Hashtagu Telugu Desk
GST Council Meeting: జీఎస్టీ మండలి (GST council) తదుపరి సమావేశం తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 9న కౌన్సిల్ భేటీ కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) నేతృత్వంలో ఢిల్లీలోని ( Delhi) విజ్ఞాన్ భవన్ (Vigyan Bhavan)లో కౌన్సిల్ 54వ సమావేశం జరగనుందని జీఎస్టీ కౌన్సిల్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. చివరి సారిగా జూన్ 22న భేటీ అయ్యింది. తదుపరి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
జీఎస్టీ విషయంలో అత్యున్నత నిర్ణయాక మండలి అయిన జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. వచ్చే నెల జరగబోయే ఈ సమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పన్ను స్లాబులను కుదించే అవకాశం ఉంది. గత సమావేశంలోనే ఈ మేరకు నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. బిహార్ డిప్యూటీ సీఎం సుమంత్ చౌదరి దీనిపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. బీమాపై జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిన వేళ ప్రస్తుత ఉన్న జీఎస్టీని తగ్గించే అవకాశమూ ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
కాగా, జూన్ 22న 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లు, విశ్రాంతి గదులు, నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు వర్తింపు, అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12 శాతంగా, కార్టన్ బాక్సులపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గింపు, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్ర, ఎరువులపై జీఎస్టీ మినహాయింపు వంటి వాటిపై నిర్ణయాలు తీసుకున్నారు.