Omicron Warning: ఓమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
ప్రపంచాన్ని భయపెడుతున్న ఓమిక్రాన్ పై కేంద్రం మరోసారి అలెర్ట్ అయ్యింది. ఇప్పటివరకు 200 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
- By Hashtag U Published Date - 11:46 PM, Tue - 21 December 21

ప్రపంచాన్ని భయపెడుతున్న ఓమిక్రాన్ పై కేంద్రం మరోసారి అలెర్ట్ అయ్యింది. ఇప్పటివరకు 200 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టే ఆలోచన ఉన్నట్లు సమాచారం. డెల్టా రకంతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ కనీసం మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెపుతుండడంతో రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలని డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు.
ఓమిక్రాన్ ను కట్టడి చేసేందుకు పలు సూచనలు చేస్తూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
అన్ని రాష్ట్రాలు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేయాలని కేంద్రం సూచించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయని, ఓమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ సమయానుకూలంగా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరాన్ని బట్టి నైట్ కర్ఫ్యూలు విధించడం, భారీ జనసమూహాలను నియంత్రించడం, కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు వంటి చర్యలను పాటించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఆక్సిజన్ పరికరాలు, ఔషధాలు వంటి వైద్య సంబంధమైన సౌకర్యాల మెరుగుదలకు అత్యవసర నిధులు వినియోగించుకోవాలని సూచించారు.