Kailash Gahlot : కేజ్రీవాల్‌కు షాక్.. బీజేపీలోకి ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్!
మంత్రి పదవికి కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) రాజీనామాను ఢిల్లీ సీఎం అతిషి అంగీకరించారు.
- Author : Pasha
Date : 17-11-2024 - 2:14 IST
Published By : Hashtagu Telugu Desk
Kailash Gahlot : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో మూడు నెలల సమయమే ఉంది. ఈ తరుణంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు భారీ షాక్ తగిలింది. రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఒక లేఖను పంపారు. మంత్రి పదవికి కూడా కైలాష్ గెహ్లాట్ రాజీనామా చేశారు. తన వద్దనున్న హోం, రవాణా, ఐటీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి పదవికి కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) రాజీనామాను ఢిల్లీ సీఎం అతిషి అంగీకరించారు. తదుపరిగా ఆయన బీజేపీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది.
Also Read :Miss Universe 2024 : ‘విశ్వ సుందరి-2024’ విక్టోరియా కెజార్.. ఆమె ఎవరు ?
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో కీలక అంశాలను కైలాష్ గెహ్లాట్ ప్రస్తావించారు. ఆప్ ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్ చాలా సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ఢిల్లీ ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని నిబద్దతతో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆశయాలను.. పార్టీలోని కొందరు నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయని కైలాష్ గెహ్లాట్ ఫైర్ అయ్యారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలను ఆప్ నెరవేర్చలేకపోయింది. యమునా నదిని శుభ్రంగా మారుస్తామని ప్రజలకు మాట ఇచ్చాం. కానీ మునుపటి కంటే ఇప్పుడే యమునా నది దారుణంగా కలుషితమైంది’’ అని ఆయన ధ్వజమెత్తారు.
Also Read :Navneet Rana : బీజేపీ నేత నవనీత్ రాణాపై కుర్చీలతో దాడి.. ఏమైందంటే..
‘‘కేజ్రీవాల్ సీఎం హోదాలో ఉన్నప్పుడు సీఎం అధికారిక నివాసాన్ని షీష్ మహల్‌లా కట్టించారనే అపవాదు వచ్చింది. ఇక సామాన్యులు ఆప్‌ను ఎలా నమ్మగలుగుతారు ?’’ అని కైలాష్ గెహ్లాట్ ప్రశ్నించారు. ‘‘ప్రజా సమస్యలు కాకుండా రాజకీయాలే ఆప్‌కు ప్రధాన ఎజెండాగా మారాయి. ప్రజల సమస్యలను తీర్చేందుకు చేసే ప్రయత్నాలు తగ్గిపోయాయి. నిత్యం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూ కూర్చుంటే ఢిల్లీలో పురోగతి అనేదే జరగదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కైలాష్ గెహ్లాట్ ఒక న్యాయవాది. ఈయన ఢిల్లీలోని నజఫ్ ఘర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2015 నుంచి ఢిల్లీ క్యాబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు తర్వాత ఢిల్లీ ఆర్థికశాఖను కూడా కైలాష్ నిర్వహించారు.