Cultural Wealth: సాంస్కృతిక సంపద తిరిగి స్వదేశానికి!
వివిధ దేశాల్లో ఉన్న పురాతన కళాకృతులు, వారసత్వ సాంస్కృతిక కళా వస్తువులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే కేంద్ర ప్రభుత్వ వ్యూహం సఫలీకృతం అవుతోంది.
- By Balu J Published Date - 01:36 PM, Mon - 21 March 22

వివిధ దేశాల్లో ఉన్న పురాతన కళాకృతులు, వారసత్వ సాంస్కృతిక కళా వస్తువులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే కేంద్ర ప్రభుత్వ వ్యూహం సఫలీకృతం అవుతోంది. తాజాగా ఆస్ట్రేలియా నుండి 29 అద్భుత కళాకృతులు తిరిగి భారత్ కి చేరాయి. వీటన్నిటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీక్షించారు. భారత్- ఆస్ట్రేలియా మధ్య నేడు జరగనున్న ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాలు నేపథ్యంలో ఈ వారసత్వ సంపద మన దేశానికీ రావడం చాల కీలకమైన పరిణామం. 9-10 శతాబ్దాలకు చెందిన ఈ 29 కళాకృతులలో శైవ , వైష్ణవ, జైన సంప్రదాయాలకు చెందిన అనేక విలువైన విగ్రహాలు, చిత్రరాజాలు ఉన్నాయి.
భారతీయ వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ కళాకృతులు ఆస్ట్రేలియా లోని వివిధ పురావస్తు ప్రదర్శన శాలల్లో ఉన్నాయి. ఈ పురావస్తువులలో తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. దోపిడీకి గురయ్యో, ఇతర కారణాలవల్లో విదేశాలకు తరలిపోయిన ఈ అత్యంత విలువైన సాంస్కృతిక సంపద తిరిగి స్వదేశానికి చేరుకోడానికి కేంద్ర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాయి. గతంలో మోడీ ఎన్నోసార్లు విదేశీ పర్యటనలు చేశారు. ఆ సమయంలో ఆయన అక్కడి చారిత్రక, పురావస్తు ప్రదేశాలను సందర్శించారు. ఆయా దేశాల్లో ఆకట్టుకున్న పురావస్తు కళాక్రుతులు, ఆకారాలు మనదేశానికి తీసుకొచ్చేందుకు చర్చలు సైతం జరిపారు.