Women Commandos : మహిళా కమాండోల ధైర్యసాహసాలు.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర
ఇంకోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాలను మావోయిస్టుల గుప్పిట నుంచి విడిపించడానికి భద్రతా దళాల్లోని మహిళా కమాండోలు(Women Commandos) పగలు, రాత్రి అనే తేడా లేకుండా పోరాడుతున్నారు.
- By Pasha Published Date - 09:14 AM, Mon - 7 October 24

Women Commandos : ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం వెంటాడుతున్నాయి. అడవులను జల్లెడ పడుతున్నాయి. తారస పడగానే ఎన్‌కౌంటర్ చేస్తున్నాయి. ఈ ఆపరేషన్లలో భద్రతా బలగాల్లోని మహిళా కమాండోలు కూడా పాల్గొంటున్నారు. మహంకాళిలా విరుచుకుపడి మావోయిస్టుల భరతం పడుతున్నారు. భద్రతా బలగాల్లోని పురుష సిబ్బందితో కలిసి మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో దుమ్ము రేపుతున్నారు. ఈనెల 4న నారాయణపూర్, దంతెవాడ జిల్లాల్లోని నెందూర్, తులతులి గ్రామాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహిళా కమాండోలు కీలక పాత్ర పోషించారు.
Also Read :Sri Lanka Election Fever: శ్రీలంకపై చైనా ప్రభావం.. ఆ దేశంలో ఎన్నికలకు ముందు భారీగా పెట్టుబడులు!
ఒకవైపు దేశవ్యాప్తంగా మహంకాళి అమ్మవారికి సంబంధించిన శారదీయ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాలను మావోయిస్టుల గుప్పిట నుంచి విడిపించడానికి భద్రతా దళాల్లోని మహిళా కమాండోలు(Women Commandos) పగలు, రాత్రి అనే తేడా లేకుండా పోరాడుతున్నారు. ఈనెల 4న జరిగిన ఎన్‌కౌంటర్ గురించి దంతెవాడ డీఐజీ కమ్లోచన్ కశ్యప్ ఇలా వివరించారు. ‘‘నాలుగు రోజుల క్రితం దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని తులతులిలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారు. దానిలో ఎంతోమంది మావోయిస్టు క్యాడర్ కూడా పాల్గొన్నారు. దీనిపై మాకు విశ్వసనీయ సమాచారం అందింది. మేం భద్రతా బలగాల్లోని మహిళా కమాండోల టీమ్‌ను కూడా అక్కడికి పంపాం. మూడు రోజుల పాటు ప్రయాణించిన తరువాత నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని మావోయిస్టుల మీటింగ్ జరుగుతున్న ప్రదేశానికి భద్రతా బలగాలు చేరాయి. ఈనెల 4న మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసులు, భద్రతా బలగాలతో కూడిన టీమ్ మరియు నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి. మహిళా కమాండోలు చాలా యాక్టివ్‌గా వ్యవహరించి మావోయిస్టులను మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరో 25 మంది మావోయిస్టులు గాయాలతో పరారైనట్లు గుర్తించాం. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశమంతా రక్తపు మరకలే కనిపించాయి’’ అని దంతెవాడ డీఐజీ కమ్లోచన్ కశ్యప్ చెప్పారు.
Also Read :Jani Master : మళ్లీ రిమాండ్ కు జానీ మాస్టర్..?
‘‘మావోయిస్టుల సమావేశంలో ప్లాటూన్ నంబర్ 6, ప్లాటూన్ నంబర్ 16, ఈస్ట్ బస్తర్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీలకు చెందిన 100 నుంచి 150 మంది నక్సలైట్లు పాల్గొన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేతల్లో ఒకరైన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊర్మిళ మరణించారు. ఆమెపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు దండకారణ్య కమిటీ సభ్యుడు, ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా పేరొందిన కమలేష్ కూడా హతమయ్యాడు.