Supreme Court : సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం వాదిస్తూ, పలు రాష్ట్రాల్లో కూడా పథకాలకు సీఎంల పేర్లు ఉంటాయి. పథకాల ప్రచారంలో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫొటోలు వాడడం కూడా సహజం. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అనుమతి తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది అని పేర్కొంది.
- By Latha Suma Published Date - 04:26 PM, Wed - 6 August 25

Supreme Court : సంక్షేమ పథకాల ప్రచారంలో ముఖ్యమంత్రులపేర్లు, ఫొటోలు వాడడంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గతంలో మద్రాసు హైకోర్టు ఈ విషయంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న విధానాన్ని తప్పుబట్టడం సరికాదని, ప్రజాప్రతినిధుల ఫొటోలు వినియోగించే హక్కు ప్రభుత్వానికి ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది.
ఏం జరిగిందంటే..?
తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం ‘విత్ యు స్టాలిన్’ అనే పేరుతో ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని తప్పుపడుతూ అన్నాడీఎంకే నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టు విచారణ అనంతరం, జీవించి ఉన్న నాయకుల పేర్లు కొత్త సంక్షేమ పథకాలకు ఇవ్వరాదని, ప్రచారంలో వారి ఫొటోలు, పార్టీ జెండాలు, గుర్తులు ఉపయోగించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంపై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం వాదిస్తూ, పలు రాష్ట్రాల్లో కూడా పథకాలకు సీఎంల పేర్లు ఉంటాయి. పథకాల ప్రచారంలో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫొటోలు వాడడం కూడా సహజం. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అనుమతి తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది అని పేర్కొంది.
పిటిషన్ దురుద్దేశపూరితమని ధర్మాసనం వ్యాఖ్యానం
ఈ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ సీవీ షణ్ముగంపై అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టును వేదికగా వాడకూడదని హితవు పలికింది. నిజంగా పథకాలపై అంత ఆందోళన ఉంటే, అన్ని పార్టీల పథకాలపై సవాలు చేయాల్సింది. కానీ మీరు ఎంచుకుని ఒక్క పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది రాజకీయ అజెండాకు కోర్టును ఉపయోగించడమే అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కనబెట్టి, పిటిషన్ వేసిన సీవీ షణ్ముగంకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో పాటు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పథకాల ప్రచారానికి నాయకుల ఫొటోలు ఉపయోగించడాన్ని నిరోధించలేమని స్పష్టం చేసింది. పథకాల పేర్లు, ప్రచారం విధానం ప్రభుత్వ హక్కులో భాగం. 2015లో సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను మార్పులు చేసేందుకు అవసరం లేదని స్పష్టం. రాజకీయ లబ్ధి కోసం కోర్టులను వేదికగా మలచడం అనైతికం అని ధర్మాసనం హెచ్చరిక. ఈ తీర్పుతో ప్రభుత్వాలకు పథకాల ప్రకటనల్లో తమ నాయకుల ఫొటోలు, పేర్లు వాడేందుకు మళ్లీ బలమైన న్యాయబలం లభించింది. రాజకీయ వ్యూహాల్లో కోర్టులను ఉపయోగించే ప్రయత్నాలు ఇకపై జాగ్రత్తగా పరిశీలించబడతాయని ఈ తీర్పు సందేశమిస్తోంది.
Read Also: Yuva Galam Padayatra : నాలుగు దశాబ్దాల కలకు ముగింపు..మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్