ULFA Peace Pact : ఉల్ఫాతో కేంద్రం చారిత్రక శాంతి ఒప్పందం.. ఏమిటిది ?
ULFA Peace Pact : ఈశాన్య భారతదేశంలో శాంతికుసుమం చిగురించింది.
- By Pasha Published Date - 06:50 PM, Fri - 29 December 23

ULFA Peace Pact : ఈశాన్య భారతదేశంలో శాంతికుసుమం చిగురించింది. సార్వభౌమ అస్సాం డిమాండ్‌తో 1979 నుంచి పోరాడుతున్న మిలిటెంట్ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా)లోని మితవాద వర్గం కేంద్ర సర్కారు, అస్సాం ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ సమక్షంలో కేంద్రం, అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్‌మెంట్ మెమొరాండంపై సంతకం చేసింది. ఈసందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. అసోం భవిష్యత్తుకు ఈరోజు ఉజ్వలమైన దినం అని పేర్కొన్నారు. ‘‘చాలా కాలంగా అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొంటున్నాయి. మెమొరాండమ్‌పై ఉల్ఫా సంతకం చేయడంతో అస్సాంకు, ఈశాన్య ప్రాంతాలకు కొత్తశకం(ULFA Peace Pact) మొదలైంది’’ అని ఆయన చెప్పారు.2014లో మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అరబింద రాజ్‌ఖోవా నేతృత్వంలోని ఉల్ఫా మితవాద బృందం, కేంద్ర ప్రభుత్వం మధ్య 12 సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. దీంతో అస్సాంలో దశాబ్దాలుగా జరుగుతున్న తిరుగుబాటు ఉద్యమానికి తెరపడుతుందని భావిస్తున్నారు. రాజ్‌ఖోవా వర్గం తొలిసారిగా 2011 సెప్టెంబర్ 3న ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (SOO) ఒప్పందంపై అప్పట్లో సంతకం చేశారు.
Also Read: 5 Skeletons : ఇంట్లో ఐదు అస్తిపంజరాలు.. హత్యలా ? ఆత్మహత్యలా ?
పరేష్ బారుహ్ నేతృత్వంలోని ఉల్ఫా యొక్క అతివాద వర్గం ఈ ఒప్పందంలో భాగంగా లేదు. చైనా-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో బారువా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. సార్వభౌమ అస్సాం డిమాండ్‌తో 1979లో ఉల్ఫా ఏర్పడింది. అప్పటి నుంచి ఇది అనేక విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొంది. ఇటువంటి హింసాత్మక చర్యల కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధిత సంస్థగా ప్రకటించింది.